హీరో అయిన మరో నృత్య దర్శకుడు
నృత్య దర్శకులు హీరోలుగా మారడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్, హరికుమార్ లాంటి నృత్య దర్శకులు కథా నాయకులుగా మారినవారే. ఇప్పడీ కోవలో తాజాగా మరో నృత్య దర్శకుడు చేరారు. ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం పోకిరి మన్నన్. శ్రీనిధి ఫిలింస్ పతాకంపై కన్నడ నిర్మాత రమేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్ఫూర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవమాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎటి ఇంద్రవర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల థియేటర్‌లో జరిగింది. నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు మారి ఆధ్వర్యంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, తొలి అప్రతిని నటుడు శాంతను అందుకున్నారు. ఈ సందర్భంగా ధాను మాట్లాడుతూ నృత్య దర్శకుడు ప్రభుదేవాలోని ప్రతిభను గుర్తించి దర్శకత్వం చెయ్యమని సలహా ఇచ్చానన్నారు.
కొంతకాలం తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారన్నారు. అలాగే ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ కూడా హీరోగా రాణిస్తారనే నమ్మకం తనకుందన్నారు. విజయ్ నటించిన పోకిరి, రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఆ రెండు చిత్రాల పేరుతో రానున్న పోకిర మన్నన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత కర్ణాటక నుంచి వచ్చి తమిళంలో చిత్రం నిర్మించారని, ఆయనకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ధాను భరోసా ఇచ్చారు.