Tamil Chitra industry
-
ఇళయ దళపతికి గాలం
ఇళయ దళపతి విజయ్‌కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో రాణించాలని ఆకాంక్షించే ఉత్తరాది బ్యూటీస్ జాబితాలో చేరిందీ భామ. ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానంది. అలా సినీ అవకాశాలు వరించినట్లు చెప్పింది. పంజాబిలో బెస్ట్ ఆఫ్ లక్, పంజాబ్ 1984 చిత్రంలో నాయికగా నటించానని పేర్కొంది. తర్వాత తమిళంలో కప్పల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం దని తెలిపింది. ఈ చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని వెల్లడించింది. చిత్ర యూనిట్ సహకారం మరువలేనిదంది. కప్పల్ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇక్కడ తొలి చిత్రమే విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన నటించడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని అసలు విషయం చెప్పింది. కప్పల్ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, వాటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపింది. -
తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు
‘‘తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు. ఇక్కడ రొటేషన్ మాత్రమే జరుగుతోంది అలాంటిది లేనిపోని దుమారాలు రేపి మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేయకండి’’ అని సీనియర్ నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ నాలుగు చిత్రాల కార్యక్రమాలకు వేదికైంది. అందులో ఒకటి నటుడు, శరత్‌కుమార్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చండమారుతం చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం. నటుడు ధనుష్ నటిస్తున్న మారి, విక్రమ్ ప్రభు నటిస్తున్న ఇదు ఎన్న మాయం, వర్ధమాన నటుడు బాలు సింహ హీరోగా నటిస్తున్న పాంబుసట్టై తదితర మూడుచిత్రాల పరిచయ కార్యక్రమాలు జరిగారుు. చండమారుతం చిత్రంలో శరత్‌కుమార్ సరసన ఓవియ, మీరానందన్ నటిస్తున్నారు. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు రాధికా శరత్‌కుమార్ లిస్టింగ్ స్టీఫెన్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టడం విశేషం. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత ఆర్బి చౌదరి ఆవిష్కరించగా శరత్‌కుమార్, ధనుష్ తదితర చిత్ర యూనిట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాధారవి మాట్లాడుతూ కోట్లు వెచ్చించి రూపొందిస్తున్న చిత్రాలపై కొందరు విడుదలైన తొలిరోజునే దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ నటించిన లింగా చిత్రంపై కూడా ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఆ చిత్రంలో అది బాగోలేదు, ఇది సరిగా లేదు, ఇది మూడు గంటలు సాగే కథ అంటూ దుమారం రేపుతున్నారన్నారు. ఇలాంటివి సినిమా పరిశ్రమకు మేలు చేయదన్నారు. వందలమంది శ్రమను పైరసీలతో దోచుకుంటున్నారన్నారు. దయ చేసి పైరసీని ప్రోత్సహించకండి అని పేర్కొన్నారు. ఒక వేదికపై నిర్వహించిన ఈ నాలుగు చిత్రాలను మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించడం విశేషం. -
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిస్తా
అనారోగ్యాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటిస్తానని సీనియర్ నటీమణి మనోరమ దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో అందరూ అభిమానంగా ఆచ్చి అని పిలుచుకునే గొప్పనటి మనోరమ. ఎంజీఆర్, శివాజీగణేశన్‌ల కాలం నుంచి నటనే జీవితంగా ముందుకు సాగుతున్నారు. మనోరమ సుమారు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. నాయికగా, ముఖ్య పాత్రధారిగా, హాస్యపాత్రధారిగా, ప్రతినాయకిగా ఇలా ఆమె పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. మనోరమ నటించారంటే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరినట్లే. మనోరమ హాస్యం పోషించారంటే ఆ చిత్రంలో నవ్వు లు విరబూయాల్సిందే. అంత అంకితభావం తో ఆమె నటిస్తారు. అలాంటి నటీమణి కొం తకాలం క్రితం బాత్రూమ్లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి పొందుతు న్న మనోరమ మళ్లీ మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి మనోరమ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె దయనీయ పరిస్థితి చూసి బాధేసిందంటూ వాపోయారు. మనోరమకు తగిన వైద్య చికి త్స అందిస్తే ఆమె మరిన్ని చిత్రాల్లో నటిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మనోరమను కాపాడుకోవలసిన బాధ్యత ఆమె అభిమానులైన సినీ ప్రముఖలందరికీ ఉందంటూ ప్రకటించారు. మనోరమ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీని చూద్దాం... ‘నేను సినిమా రంగ ప్రవేశంచేసి 50 ఏళ్లు దాటింది. మొట్టమొదటిసారిగా సింహళ భాషా చిత్రంలో నటించాను. తమిళంలో ముల్లైతొట్ట మంగై చిత్రం లో పరిచయమయ్యాను. దివంగత ప్రఖ్యాత రచయిత కన్నదాస్ నన్ను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఆ తరువాత వరుసగా అన్ని భాషల్లోనూ నటించాను. ప్రస్తుతం పేరాండి అనే చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని నెలలుగా బయటకు వెళ్లడం లేదు. అలాంటిది సీనియర్ నటుడు ఎస్ఎస్ రవిచంద్రన్ కన్నుమూశారన్నవార్త విని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. నా ఆరోగ్యం బాగుండలేదని తెలిసి కొందరు సినీ ప్రముఖులు ఫోన్ చేస్తూ పరామర్శిస్తున్నారు. ఎంజీఆర్ జ్ఞాపక చిహ్నం, శివాజీ గణేశన్ ఇల్లు చూడడానికి వచ్చే అభిమానులు నన్ను చూడడానికి వస్తుంటా రు. ఇది నాకెంతో మనశ్శాంతిని కలిగిస్తున్న విష యం. కమలహాసన్ జన్మదినం నాడు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. అప్పుడు కమ ల్ అమ్మలేని కొరతను తీర్చారు అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌లకు వెళ్లడం లేదు. ఇప్పుడిక నాకు కాలక్షేపం టీవీనే. నేను నటించిన పాత చిత్రాల సన్నివేశాలను చూస్తుంటే నాటి మధుర జ్ఞాపికలు గుర్తుకొస్తుంటాయి. నా కొడుకొకసారి నీ ఒంట్లో విషం చేరుతోందని చెప్పారు. తను అన్నట్లు గానే ఇప్పుడు జరిగింది. నా ఈ పరిస్థితి అశాశ్వతమే. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నటిస్తాను’ అంటూ మనోరమ తన మనసులోని మాటను బయటపెట్టారు. -
విమల్‌తో మరోసారి
నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ పాగా వేస్తోంది. ఇంతకుముందు అంగాడి తెరు, ఎంగేయుం ఎప్పోదు, కలగలప్పు వంటి చిత్రాలతో విజయాల బాట పట్టిన అంజలి అనూహ్యంగా తన పినతల్లితో మనస్పర్థలు కారణంగా హైదరాబాదుకు వెళ్లిపోయి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ తెలుగమ్మాయి తాజాగా మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం సూరజ్ దర్శకత్వంలో జయం రవితో జతకడుతున్న అంజలికి మరో అవకాశం వచ్చింది. మాప్పిళ్లై సింగం అనే నూతన చిత్రంలో విమల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు తూంగానగరం, కలగలప్పు చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి విమల్‌తో రొమాన్స్‌కు సై అంది. ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ సంస్థ అధినేత మదన్ నిర్మించనున్నారు. ఇంతకు ముందు మాన్ కరాటే వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈయన ప్రస్తుతం ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కయల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి విమల్, అంజలిల మాపిళ్లైసింగం చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. -
ముద్దులతో రికార్డు సాధిస్తా
పెదవి ముద్దులతో రికార్డ్ సాధిస్తానంటోంది నటి రెజీనా. కోలీవుడ్ హీరోయిన్లకు అచ్చొచ్చిన సినిమారంగం అనవచ్చు. మలయాళ భామలు, ముంబయి బ్యూటీస్ దృష్టి ముందుగా దక్షిణాదిలో తమిళ చిత్ర పరిశ్రమ పైనే పడుతుంది. ఇక్కడ హీరోయిన్గా కాలుపెట్టి కాస్త పేరు తెచ్చుకుంటే చాలు ఇతర భాషల్లో బ్రహ్మరథం పట్టేస్తారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నా తాజాగా రెజీనా సినీ కెరీర్‌నే ఉదహరించవచ్చు. ఈ బ్యూటీ తమిళంలో కేడీ బిల్లా కిలాడీ రంగ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. అయినా రెజీనాకు ఇక్కడ మరిన్ని అవకాశాలు రాలేదు. అయితేనేం ఈ అమ్మడిపై టాలీవుడ్ దృష్టి పడింది. అక్కడ కొత్త జంట చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత రారా కృష్ణయ్య, పవర్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పవర్ చిత్రంలో ఆ చిత్ర హీరో రవితేజతో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి బోలెడు ప్రచారం పొందింది. తాజాగా నవ నటుడు, ప్రఖ్యాత నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ సరసన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో ఆయన్ని లిప్‌లాక్‌లతో ముంచెత్తిందనే ప్రచారం హోరెత్తుతోంది. నటి రెజీనా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఒక విషయంలో ప్రశ్నలు గుప్పిస్తూ తనను నోరుజారే పరిస్థితికి తీసుకొస్తారని నిష్టూరం ఆడింది. మళ్లీ తనే మాట్లాడుతూ ఇంతకీ మీరడిగిన ప్రశ్న ఏమిటి లిప్‌లాక్‌ల విషయం గురించేనా? అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి చుంభనాల సన్నివేశాలలో నటించి రికార్డ్ కెక్కుతానని రెజీనా పేర్కొంది. -
ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి?
‘ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి? నటనకు దూరం అవ్వాలి?’ అంటూ ప్రశ్నిస్తోంది నటి మీరా నందన్. వాల్మీకి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ భామ మీరానందన్. మలయాళంలో 25 చిత్రాలకు పైగా నటించి బిజీ నటిగా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో చాలా తక్కువ చిత్రాలే చేసింది. కొంచెం గ్యాప్ తరువాత సండమారుతం చిత్రంలో శరత్‌కుమార్‌కు జంటగా రీఎంట్రీ అవుతోంది. ఈ సందర్భంగా నటి మీరానందన్తో చిన్న భేటీ. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం? జ: అందరి మాదిరిగానే ఎంతో ఊహించుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రమే నిరాశపరచడంతో ఊహలు తారుమారయ్యాయి. ఆ తరువాత నటించిన కొన్ని చిత్రాలు కూడా సరిగా ఆడలేదు. అందువల్ల మంచి కథ, పాత్ర, మంచి దర్శకుడు చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. అలాంటి అవకాశం రాకపోవడమే ఈ గ్యాప్‌నకు కారణం. ప్ర: దర్శకుడొకరు మిమ్మల్ని ఒన్ సైడ్ లవ్ చేస్తుండటంతోనే విరక్తి చెంది తమిళ సినిమాకు దూరమయ్యారనే ప్రచారం గురించి మీ స్పందన? జ: ఎవరో ఏదో చెప్పడానికి నేనెందుకు సీరియస్‌గా తీసుకోవాలి? ఆ విషయాన్ని నేనూ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు విరక్తికి గురవుతాను. ప్ర: సండమారుతం చిత్రం గురించి? జ: ఈ చిత్రంలో నేను పొల్లాచ్చి ప్రాంతంలో నివసించే మహాలక్ష్మి అనే గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. చిత్రం ప్లాష్ బ్యాక్‌లో దాదా లాంటి సర్వేశ్వర్ (శత్‌కుమార్)కు జంటగా నటిస్తున్నాను. తాను నటించిన సన్నివేశాలు పొల్లాచ్చిలో ఇటీవల చిత్రీకరించారు. షూటింగ్ చాలా జాలీగా జరిగింది. శరత్‌కుమార్ నటనకు సంబంధించి పలు టిప్స్ చెప్పి ప్రోత్సహించారు. ప్ర: మీ కంటే చాలా సీనియర్ నటుల సరసన నటించడం మీ ఇమేజ్‌కు బాధింపు ఏర్పడుతోందని భావించడంలేదా? జ: నేనలా ఎప్పుడూ ఆలోచించలేదు. తమిళంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ దక్కించుకునే అవకాసంగా భావిస్తున్నాను. అంతేకాకుండా చిత్ర నిర్మాతలలో ఒకరైన లిస్టన్ స్టీపన్ తనకు మంచి స్నేహితుడు. ఇది మంచి కథ నువ్వు తప్పకుండా నటించాలని కోరడంతో నిరాకరించలేకపోయాను. నా వయసు వారు నా కంటే టాప్‌లో ఉన్నా వారే సీనియర్ నటులతో నటిస్తుండగా నేను నటించ కూడాదా? అంతే కాకుండా సండమారుతం చిత్ర కథలో శరత్‌కుమార్ నాకంటే చాలా పెద్ద వాడిగా నటిస్తున్నారు. నేనే మామ, మామా అంటూ ఆయన చుట్టూ తిరిగుతుంటాను. ప్ర: సరే. మీరిప్పటికీ చదువు కొనసాగిస్తున్నారట? జ: బెంగళూర్ కళాశాలలో ఎం.ఏ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నాను. నాకు ఇష్టమైన రంగం మీడియా. నేను టీవీ యాంకర్‌గా చేసి సినీ రంగానికి వచ్చాను. ప్ర: పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: 25 ఏళ్లు దాటగానే ఎదుర్కొనే ప్రశ్న ఇది. అయితే త్వరలోనే అనే బదులే ప్రస్తుతానికి చెప్పగలను. -
హీరో అయిన మరో నృత్య దర్శకుడు
నృత్య దర్శకులు హీరోలుగా మారడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్, హరికుమార్ లాంటి నృత్య దర్శకులు కథా నాయకులుగా మారినవారే. ఇప్పడీ కోవలో తాజాగా మరో నృత్య దర్శకుడు చేరారు. ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం పోకిరి మన్నన్. శ్రీనిధి ఫిలింస్ పతాకంపై కన్నడ నిర్మాత రమేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్ఫూర్తి హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవమాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎటి ఇంద్రవర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో జరిగింది. నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు మారి ఆధ్వర్యంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, తొలి అప్రతిని నటుడు శాంతను అందుకున్నారు. ఈ సందర్భంగా ధాను మాట్లాడుతూ నృత్య దర్శకుడు ప్రభుదేవాలోని ప్రతిభను గుర్తించి దర్శకత్వం చెయ్యమని సలహా ఇచ్చానన్నారు. కొంతకాలం తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారన్నారు. అలాగే ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ కూడా హీరోగా రాణిస్తారనే నమ్మకం తనకుందన్నారు. విజయ్ నటించిన పోకిరి, రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఆ రెండు చిత్రాల పేరుతో రానున్న పోకిర మన్నన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత కర్ణాటక నుంచి వచ్చి తమిళంలో చిత్రం నిర్మించారని, ఆయనకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ధాను భరోసా ఇచ్చారు. -
టాప్ హీరోల డబుల్ ధమాకా
ఒకే సంవత్సరంలో రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్ సినిమాలు రెండేసి విడుదల కావడం విశేషం. ఎప్పుడూ రెండు మూడేళ్లు వ్యవధి తీసుకునే కమల్, రజనీ కూడా ఈ సారి రెండు చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమల్ తప్ప ముగ్గురు హీరోలు ఇప్పటికే ఒక్కో సినిమాను విడుదల చేశారు. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. ప్రస్తుం చిన్న చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు ఎక్కువగా హిట్టవుతున్నాయి. భారీ కమర్షియల్ చిత్రాలను కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. వీటిలో టాప్ స్టార్స్ చిత్రాలకు క్రేజే వేరు. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్‌హాసన్, ఇళయ దళపతి విజయ్, అల్టిమేట్ స్టార్ అజిత్, సూపర్‌హీరో సూర్య లాంటి నటుల చిత్రాలంటే ఇటు చిత్ర పరి శ్రమ, అటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వారి చిత్రాలకు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. గ్యాప్‌కు కారణం ఇదే అతిశ్ర ద్ధ అనుకోని అనవసరపు జోక్యం అనుకోని ఎవరెలాంటి కామెంట్ చేసినా స్టార్ హీరోలు మాత్రం కథ నుంచి, సహ నటీనటులు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, చాయాగ్రహణం లాంటి విషయాల్లో కూడా తమ ప్రమేయం ఉండేలా చూసుకుంటారు. ఆ మధ్య సూర్య, గౌతమ్ మీనన్ దర్శకత్వం లో నటించే విషయమై కథ సంతృప్తిగా లేదంటూ సుమారు ఏడాదికిపైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత కూడా కథ తృప్తి కలగకపోవడంతో తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసి చిత్రం నుంచి డ్రాప్ అయ్యారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. విజయంపై గ్యారెంటీ లేదు అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ చిత్రం హిట్ అవుతుందా అంటే ఈ విషయంలో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. దాన్ని నిర్ణయించేది ప్రేక్షక దేవుళ్లే. అలాగే హీరోల జోక్యంపై విమర్శించేవారు ఉన్నారు. ఆహ్వానించే వారు ఉన్నారు. ఏదేమైనా చిత్రంలో కొత్త దనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదంటే ఎవరు నటించిన చిత్రం అయినా తిప్పికొడుతున్నారు. డబుల్ ధమాకా అయితే తమ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, రెండేళ్లకో మూ డేళ్లకో ఏడాదికో ఒక చిత్రంలో నటించే టాప్ హీరోలు ఈ ఏడాది కాస్త స్పీడ్ పెంచడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మభూషణ్ కమల్‌హాసన్, విజయ్, అజిత్ వంటి టాప్ హీరోలు నటించిన రెండేసి చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. రజనీకాంత్ ఎందిరన్ తర్వాత కోచ్చడయాన్/విక్రమసింహకు మూడేళ్లుపైగా పట్టింది. అలాగే కమల్‌హాసన్ విశ్వరూపం చిత్రం అంతకు ముందు చిత్రాలకు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అలాంటిది ఈ ఏడాది మే లో రజని కోచ్చడయాన్తో తెరపైకి వచ్చారు. తాజాగా నటిస్తున్న లింగా చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రజని డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకుడు. కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం-2 నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. కమల్ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆండ్రియ, పూజకుమారి, పార్వతి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం కమల్‌హాసన్ తన మిత్రుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమవిలన్ చిత్రం చేస్తున్నారు. ఇందులో కమల్ రెండు వైవిద్యభరిత పాత్రల్ని పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే తెరపైకి రానుంది. అలాగే విజయ్ నటించిన జిల్లా చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యింది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం చేస్తున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. దీపావళి సందర్భంగా కత్తిని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కత్తి చిత్రంలో ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయ డం విశేషం. ఇలా రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌లు ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు వరుసగా ఒకే ఏడాది తెరపైకి రానుండటం మరో విశేషం. అలాగే డబుల్ దమాకాకు రెడీ అవుతున్న మరో స్టార్ హీరో అజిత్. ఈయన నటించిన వీరం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ భాగంలో టాప్స్టార్లు తమ చిత్రాలతో సందడి చేయడానికి రెడీ అవుతుండటం అభిమానులకు ఆనందమే ఆనందం. -
శృంగార తార బ్లాక్ మెయిలింగ్
ఒకప్పుడు శృంగార నటిగా ప్రకాశించి, అవకాశాలు ముఖం చాటేయడంతో ప్రముఖులకు వల వేసి బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు దండుకునే వ్యాపారం మొదలెట్టింది. విషయం పోలీసులకు తెలియడంతో చెన్నైలో ముఖం దాచుకుందని సమాచారం. వివరాల్లోకెళితే కన్నడ చిత్ర పరిశ్రమలో శృంగార నటిగా పేరొందిన నయన కృష్ణకు తరువాత అవకాశం లేకపోవడంతో వేశ్య వృత్తిలోకి దిగిందని సమాచారం. ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగి తన సహచర బృందంతో దాన్ని వీడియో తీయించి వాటిని చూపించి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందట. అలా ఒక బెంగళూర్‌కు చెందిన డాక్టర్ నయన కృష్ణ మాయలోపడ్డారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్పింగ్‌లను చూపి కోటి రూపాయలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడిందట. దీంతో దిమ్మ తిరిగి ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూర్ పోలీసులు ఈ బ్లాక్‌మెయిలింగ్ ముఠా కోసం వలపన్నారు. నయన కృష్ణ మోసానికి గురైన డాక్టర్ పోలీసుల సూచన ప్రకారం ఆమెకు ఫోన్ చేసి మొదట ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. దీంతో ఆ డబ్బు తీసుకోవడానికి వచ్చిన నయన కృష్ణ ముఠాకు చెందిన ముగ్గురులో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరొకడు తప్పించుకొని పారిపోయాడు. అతనితోపాటు నయన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయన కృష్ణ చెన్నైలో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమచారం అందడంతో చైన్నై పోలీసుల సహాయంతో ఆమెను పట్టుకోవడానికి బెంగళూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసు వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.