టాప్ హీరోల డబుల్ ధమాకా
ఒకే సంవత్సరంలో రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్ సినిమాలు రెండేసి విడుదల కావడం విశేషం. ఎప్పుడూ రెండు మూడేళ్లు వ్యవధి తీసుకునే కమల్, రజనీ కూడా ఈ సారి రెండు చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమల్ తప్ప ముగ్గురు హీరోలు ఇప్పటికే ఒక్కో సినిమాను విడుదల చేశారు.
ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. ప్రస్తుం చిన్న చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు ఎక్కువగా హిట్టవుతున్నాయి. భారీ కమర్షియల్ చిత్రాలను కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. వీటిలో టాప్ స్టార్స్ చిత్రాలకు క్రేజే వేరు. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్‌హాసన్, ఇళయ దళపతి విజయ్, అల్టిమేట్ స్టార్ అజిత్, సూపర్‌హీరో సూర్య లాంటి నటుల చిత్రాలంటే ఇటు చిత్ర పరి శ్రమ, అటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వారి చిత్రాలకు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.
గ్యాప్‌కు కారణం ఇదే
అతిశ్ర ద్ధ అనుకోని అనవసరపు జోక్యం అనుకోని ఎవరెలాంటి కామెంట్ చేసినా స్టార్ హీరోలు మాత్రం కథ నుంచి, సహ నటీనటులు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, చాయాగ్రహణం లాంటి విషయాల్లో కూడా తమ ప్రమేయం ఉండేలా చూసుకుంటారు. ఆ మధ్య సూర్య, గౌతమ్ మీనన్ దర్శకత్వం లో నటించే విషయమై కథ సంతృప్తిగా లేదంటూ సుమారు ఏడాదికిపైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత కూడా కథ తృప్తి కలగకపోవడంతో తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసి చిత్రం నుంచి డ్రాప్ అయ్యారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.
విజయంపై గ్యారెంటీ లేదు
అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ చిత్రం హిట్ అవుతుందా అంటే ఈ విషయంలో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. దాన్ని నిర్ణయించేది ప్రేక్షక దేవుళ్లే. అలాగే హీరోల జోక్యంపై విమర్శించేవారు ఉన్నారు. ఆహ్వానించే వారు ఉన్నారు. ఏదేమైనా చిత్రంలో కొత్త దనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదంటే ఎవరు నటించిన చిత్రం అయినా తిప్పికొడుతున్నారు.
డబుల్ ధమాకా
అయితే తమ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, రెండేళ్లకో మూ డేళ్లకో ఏడాదికో ఒక చిత్రంలో నటించే టాప్ హీరోలు ఈ ఏడాది కాస్త స్పీడ్ పెంచడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మభూషణ్ కమల్‌హాసన్, విజయ్, అజిత్ వంటి టాప్ హీరోలు నటించిన రెండేసి చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి.
రజనీకాంత్ ఎందిరన్ తర్వాత కోచ్చడయాన్/విక్రమసింహకు మూడేళ్లుపైగా పట్టింది. అలాగే కమల్‌హాసన్ విశ్వరూపం చిత్రం అంతకు ముందు చిత్రాలకు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అలాంటిది ఈ ఏడాది మే లో రజని కోచ్చడయాన్‌తో తెరపైకి వచ్చారు. తాజాగా నటిస్తున్న లింగా చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రజని డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకుడు.
కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం-2 నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. కమల్ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆండ్రియ, పూజకుమారి, పార్వతి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం కమల్‌హాసన్ తన మిత్రుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమవిలన్ చిత్రం చేస్తున్నారు. ఇందులో కమల్ రెండు వైవిద్యభరిత పాత్రల్ని పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే తెరపైకి రానుంది. అలాగే విజయ్ నటించిన జిల్లా చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యింది.
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. దీపావళి సందర్భంగా కత్తిని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కత్తి చిత్రంలో ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయ డం విశేషం. ఇలా రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌లు ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు వరుసగా ఒకే ఏడాది తెరపైకి రానుండటం మరో విశేషం.
అలాగే డబుల్ దమాకాకు రెడీ అవుతున్న మరో స్టార్ హీరో అజిత్. ఈయన నటించిన వీరం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ భాగంలో టాప్‌స్టార్‌లు తమ చిత్రాలతో సందడి చేయడానికి రెడీ అవుతుండటం అభిమానులకు ఆనందమే ఆనందం.