సినిమాలో క్రైమ్‌ నడుస్తుంది.. | Dandupalyam 2 Movie Director Srinivasa Raju Interview | Sakshi
Sakshi News home page

సినిమాలో క్రైమ్‌ నడుస్తుంది..

Published Sun, Nov 5 2017 12:57 AM | Last Updated on Sun, Nov 5 2017 12:57 AM

Dandupalyam 2 Movie Director Srinivasa Raju Interview - Sakshi

ప్రపంచ సినిమాలో రియల్‌ క్రైమ్‌ ఇన్సిడెంట్స్‌ని తీసుకుని, సీక్వెల్స్‌గా బిల్డ్‌ చేసి, పెద్ద హిట్స్‌ అందుకున్న సంస్థలు ఉన్నాయి. యూనివర్శల్, ఫాక్స్‌స్టార్‌ వంటివి. సినిమాలో క్రైమ్‌ కాకుండా క్రైమ్‌ని సినిమాగా చూపించడం అనే శ్రీనివాసరాజు  ఎక్స్‌పరిమెంట్‌ మూడు సీక్వెల్స్‌తో క్లోజ్‌. ఇది భారత సినిమాలో ‘క్రైమ్‌ రాయి’.
ఆడవాళ్లూ జాగ్రత్త...

మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా? ఒక లేడీ తలుపు తట్టి, మంచినీళ్లు అడిగిందా?
నీళ్లు ఇవ్వడానికి మీరు లోపలికి వెళితే ఘోరం జరుగుతుంది. మీ వెనకాలే ముందు ఆమె, ఆ తర్వాత ఆమె గ్యాంగ్‌ ఇంట్లోకి చొరబడతారు. ఇంటిని, మీ మానాన్ని దోచుకుంటారు. చివరికి మిమ్మల్ని కిరాతకంగా చంపేస్తారు. అందులో ఒకడు మరీ ఘోరమైనవాడు. పీక కోసి చంపుతాడు. పీకలోంచి రక్తం వస్తున్నప్పుడు వచ్చే శబ్దం అతనికి ఇష్టం. అక్కడ చెవి ఆన్చి, శబ్దం వింటూ ఆనందంలో మునిగిపోతాడు. ‘దండుపాళ్యం’ సినిమా గుర్తొస్తోంది కదూ!

కర్నాటకలోని దండుపాళ్యకి చెందిన గ్యాంగ్‌ ‘దండుపాళ్య’. దోపిడీలు, హత్యలు, మానభంగాలు... ఇవే ఆ గ్యాంగ్‌ పని. ఈ గ్యాంగ్‌ పేరు వింటే అక్కడి వాళ్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2012లో దర్శకుడు శ్రీనివాసరాజు ఈ దండుపాళ్య గ్యాంగ్‌ ఆధారంగా తీసిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘ఇలాంటి మనుషులు ఉంటారా?’ అనుకోకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత ‘దండుపాళ్యం–2’ వచ్చింది. ఈ నెల ‘దండుపాళ్యం–3’ రాబోతోంది. ‘‘ఈ సిరీస్‌లో ఇదే లాస్ట్‌ పార్ట్‌. యాక్చువల్‌గా ఐదు పార్ట్స్‌ తీయాలనుకున్నాను కానీ, మూడింటితోనే ముగిస్తున్నా. రియల్‌ క్రైమ్‌ స్టోరీ ఆధారంగా క్రైమ్‌ నేపథ్యంలో మూడు భాగాలుగా ఇండియన్‌ స్క్రీన్‌ మీద వచ్చిన ఫస్ట్‌ మూవీ ఇది’’ అన్నారు శ్రీనివాసరాజు. మూడో భాగాన్ని రజనీ తాళ్ళూరి నిర్మించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ‘‘దండుపాళ్యం’ని 26 రోజుల్లో తీశాను. ఆడిందా? ఓకే! లేకపోతే? కష్టాలు తప్పవు. అందుకే రిలీజయ్యాక నా అసిస్టెంట్‌ని థియేటర్‌కి పంపించి, అసలు జనాలు ఉన్నారో లేదో చూడనమన్నాను. థియేటర్‌ నుంచి ఫోన్‌... హౌస్‌ఫుల్‌ అని. ఆ తర్వాత నేను థియేటర్‌కి వెళితే అక్కడ బ్లాక్‌ టికెట్లు అమ్ముతున్న వ్యక్తి ‘50 రూపాయల టికెట్‌ ఒక్కటే ఉంది. 150 సార్‌’ అన్నాడు. థియేటర్‌ మేనేజర్‌ నన్ను గుర్తుపట్టి, లోపలికి తీసుకెళ్లారు. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఫస్ట్‌ పార్ట్‌ హిట్టవ్వడంతో సెకండ్‌ పార్ట్‌ మీద చాలా క్రేజ్‌ పెరిగింది. అది ఓకే అనిపించుకుంది. బోలెడన్ని అంచనాల మధ్య ఇప్పుడు థర్ట్‌ పార్ట్‌ రెడీ అయింది. ఇందులో ఏం ఉందో ప్రస్తుతానికి సస్పెన్స్‌’’ అన్నారు.

డైరెక్టర్‌గా మంచి కథ చెప్పాలి కానీ, క్రైమ్‌ బేస్ట్‌ రియల్‌ స్టోరీని ఎందుకు తీసుకున్నారు? టికెట్స్‌ తెగడానికా? అసలు న్యూడ్‌ సీన్స్‌ చూపించాల్సిన అవసరం ఏంటి?
అనడిగితే – ‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్‌. అల్లిన కథతో తీస్తారు. లేకపోతే రియల్‌ స్టోరీతో తీస్తారు. నేను రెండోది సెలెక్ట్‌ చేసుకున్నా. రియల్‌ స్టోరీ తీస్తున్నప్పుడు రియల్‌గా జరిగినవి తీయాలి కదా’’ అన్నారు.

ఏం చెప్పి పూజా గాంధీ, సంజనాలతో నగ్న దృశ్యాల్లో నటింపజేశారు?
అనడిగితే – ‘‘కథ నచ్చినా న్యూడ్‌ సీన్స్‌ ఉన్నాయని పూజా గాంధీ ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి మరో నటి రమ్య ఆసక్తిగా ఉందని తెలిసి, పూజా వదలుకోకూడదనుకుంది. ‘మా అమ్మకు కథ చెబుతారా’ అనడిగింది. తల్లీకూతుళ్లిద్దరూ కథ విన్నారు. ‘ఈ సినిమా మిస్సయితే నటిగా నువ్వు చాలా కోల్పోయినట్లే’ అని తల్లి చెప్పడంతో పూజా గాంధీ ఈ సినిమా చేసింది. సెకండ్‌ పార్ట్‌లో సంజన కూడా సీన్‌ డిమాండ్‌ మేరకు చేసింది. ఆ సీన్స్‌ అలా తీయకపోతే సినిమా పండదు. రియల్‌గా జరిగినవే కాబట్టి, కాంప్రమైజ్‌ కాకూడదనుకున్నా. ఇలాంటి సీన్స్‌ తీసేటప్పుడు లొకేషన్లో తక్కువమంది ఉండేలా చూసుకుంటారు. కానీ, నేను మాత్రం యూనిట్‌ అంతా ఉంటారు. మీకిష్టమైతేనే చేయండి అని క్లారిటీగా చెప్పాను. వాళ్లూ చేసారు. ఈ సీన్స్‌ చేయాల్సిందేనని నేనెవర్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే ఇష్టపడి చేశారు’’ అని చెప్పారు.

త్వరలో విడుదల కానున్న థర్డ్‌ పార్ట్‌ ఎలా ఉంటుంది?
అనే ప్రశ్నకు –‘‘ఫస్ట్, సెకండ్‌ పార్ట్‌ కన్నా థర్డ్‌ పార్ట్‌ బీభత్సంగా ఉంటుంది. టికెట్స్‌ తెగుతాయనీ, కావాలనీ ఏ సీనూ పెట్టలేదు. జరిగిందే చూపించా. ఈ సిరీస్‌లో చివరి పార్ట్‌ ఇదే. ఆల్రెడీ రెండు పార్ట్స్‌ బాగా ఆడటంతో థర్ట్‌ పార్ట్‌కి చాలా క్రేజ్‌ వచ్చింది. ఈ పార్ట్‌తో నా ‘దండుపాళ్యం’ జర్నీ కంప్లీట్‌ అవుతుంది. అయితే, కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని జర్నీ ఇది’’ అని శ్రీనివాసరాజు అన్నారు.
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, సంజన, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, కెమెరా: వెంకట ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement