దాసరి అరుణ్‌కుమార్
‘‘ఈ నెల 24న తన డ్రైవర్‌తో పాటు దాసరి అరుణ్ మా గేటు దూకి ఇంట్లోకి వచ్చాడు. మద్యం తాగి వచ్చి నాపై, నా భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మా నాన్నగారి బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్నగారి వీలునామా ప్రకారం ఈ ఇంటికి ఆయన మనవరాలైన నా కూతురు అర్హురాలు. ఆస్తి కోసం దాసరి అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడు. దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాసరి ప్రభు. అలాగే మోహన్‌బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ వంటి పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కార మార్గాన్ని చూపాలంటున్నారు ప్రభు.
‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ఏ శాఖకు సమస్య వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మా నాన్నగారు దాసరి నారాయణరావు ముందుకొచ్చి పరిష్కరించేవారు. అలాంటి దాసరి కొడుకులుగా పుట్టి ఆయన పేరుని చెడగొడుతున్నందుకు చాలా బాధగా ఉంది. అందరి ఇళ్లల్లో ఉన్నట్లు మా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేం దాసరి గారి పిల్లలం కాబట్టి ఇంత రచ్చ జరుగుతోంది. అన్నయ్య (దాసరి ప్రభు)కు, నాకు మధ్య ఉన్నవి వందకు వంద శాతం ఆస్తి గొడవలే’’ అంటున్నారు దాసరి అరుణ్‌కుమార్. శుక్రవారం అరుణ్‌పై అతని అన్న ప్రభు జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు.
గోడ దూకి తన ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై చేయి చేసుకున్నాడని అరుణ్‌పై ఆరోపించారు దాసరి ప్రభు. ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలను పంచుకోవడానికి శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు దాసరి అరుణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘నేను 24వ తేదీన 9.30 నిమిషాలకు ఫిలింనగర్ రోడ్ నం 47లోని మా ఇంటి (చనిపోయేవరకూ దాసరి ఉన్న ఇల్లు. ఇప్పుడు పెద్ద కుమారుడు ప్రభు తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉంటున్నారు)కి వెళ్లాను. ఆ రోజు సాయంత్రం 6.30 నాకు కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే, కలెక్ట్ చేసుకుందామని వెళ్లాను. అరగంట సేపు కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. మా ఇల్లే కదా అని గోడ దూకి వెళ్లాను.
మా ఇంటి గోడను నాన్న (దాసరి నారాయణరావు) ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు దూకాను. అందులో తప్పేముంది? మా ఇల్లే కదా. మూడు రోజుల క్రితం అలా దూకిన తర్వాత కింద హాలు తలుపు తీసుకుని హాల్లోకి వెళ్లాను. ఎవరూ కనిపించకపోయేసరికి పైకి వెళ్లాను. అక్కడ ఉన్న అన్నయ్యతో ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే వెళ్లిపోతా’ అన్నాను. లేదని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తర్వాత జూబ్లీహిల్స్ ఎస్.ఐ. నవీన్‌గారు, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయన వచ్చి ‘గొడవ ఏంటండి’ అన్నారు. ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, తీసుకోవటానికి వచ్చా’నన్నాను. ఆయన నాకు డాక్యుమెంట్ ఇప్పించారు. ఆయన అక్కడ ఉండగానే నేనక్కడ్నుంచి వెళ్లిపోయాను.
ఇది జరిగిన రెండో రోజు నా మీద పోలీస్ కంప్లయింట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒకవేళ నేను ఎవరినైనా కొట్టుంటే ఆ రోజే కేస్ పెట్టాలి. ఒకరోజు గ్యాప్ తీసుకుని శుక్రవారం కేస్ ఫైల్ చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక అరగంట నాతో, మా చెల్లితో కూర్చుంటే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా మీడియాకు పరిగెడతాడు. గతేడాది మే నెల నుండి ఈ ఆస్తి గొడవలు ఉన్నాయి. అప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ‘మా తమ్ముడు నాకు అన్యాయం చేశాడు’ అని చెప్పారట. అప్పుడు సీఐ గారు ఫోన్ చేసి, ‘మీ బ్రదర్‌కి మీరు అన్యాయం చేశారని కేస్ పెట్టారు’ అన్నారు. అన్యాయం చేశానని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? డాక్యుమెంట్ ఏదైనా ఉందా? చెక్ ఉందా? ఉంటే చెప్పండని అడిగాను.
అప్పటినుండి ఇలానే ఏదో ఒక గొడవ చేస్తున్నాడు. నేను అన్నయ్యతో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవటానికి రెడీ. కానీ, ఆయనే మీడియాకి వెళుతున్నారు. దానివల్ల ఏమీ రాదు. గతేడాదిగా ఆయన ఇంటర్వ్యూలు నేను నాలుగు చూశాను. ఇండస్ట్రీ పెద్దలు మాకేమీ చేయడంలేదు అంటారు. మా బ్రదర్ మాట్లాడితే మోహన్‌బాబు, మురళీమోహన్, సి.కల్యాణ్‌గార్ల చెబుతారు. అప్పటికీ నిన్న సి.కళ్యాణ్‌గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాను. సరేలే చూద్దాం అన్నారు. ఆయనేమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆ ఇంటి మీద కోర్టు ఆర్డర్ ఉంది. అదేంటంటే, మా ముగ్గురి అంగీకారంతోనే ఆ ఇంటిని అమ్మాలి. అలా కాకుండా ఏదైనా వీలునామా ఆయన దగ్గరుంటే చూపించమనండి, నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు.
‘ఈ ఇంట్లో మీరు ఎందుకు ఉండటంలేదు’ అని అడిగిన ప్రశ్నకు అరుణ్ సమాధానమిస్తూ – ‘‘నాకు జూబ్లీహిల్స్‌లో ఇంకో ఇల్లు ఉంది. అక్కడ ఉంటున్నాను. ఈ ఇంటిని ఆఫీస్‌లా వాడుకుంటున్నాను. మా సిస్టర్‌కి వేరే ఇల్లుంది. ఆమె అక్కడ ఉంటుంది. మా అన్నయ్య డిప్రెషన్‌తో బాధపడుతున్నాడేమో అనుకుంటున్నా. ఆ ఇంటికి సంబంధించి మా ముగ్గురికీ సమానమైన హక్కుంది. ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కేస్ పెట్టడంతో రియాక్ట్ అవ్వక తప్పలేదు. పోలీస్, మీడియాను సంప్రదించే టైమ్‌ని మా అన్నయ్య నాకు, మా సిస్టర్‌కి కేటాయిస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. ది గ్రేట్ దాసరి నారాయణరావుగారి పేరు ఇలా బజారుకి ఎక్కేది కాదు. నాకైతే ఎటువంటి సమస్య లేదు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి క్లియర్ చేసుకోమని పత్రికా ముఖంగా మా అన్నయ్యకు చెబుతున్నాను. చిరంజీవిగారు మా సమస్యని సాల్వ్ చేస్తున్నారని కొన్ని మీడియా హౌస్‌లు రాస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అనవసరంగా ఆయన్ను ఇందులోకి లాగుతున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment