బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తాజాగా నటించిన చిత్రం ‘ఛపాక్’. ఇప్పటివరకు సుమారు రూ.40 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా భావించిన దీపిక యాసిడ్ బాధితుల కోసం క్యాంపెయిన్ సైతం నిర్వహించింది. అంతేకాక దేశంలో యాసిడ్ అమ్మకాలు ఏమేరకు జరుగుతున్నాయని సోషల్ ఎక్స్‌పర్మెంట్ చేసి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీపిక ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో తాను జేఎన్‌యూను సందర్శించించడాన్ని తప్పుపడుతూ ప్రఖ్యాత వెబ్‌సైట్ ఐఎమ్‌డీబీలో ‘ఛపాక్’ సినిమాకు దారుణమైన రేటింగ్ ఇవ్వడంపై స్పందించింది. ‘వాళ్లు ఐఎమ్‌డీబీ రేటింగ్ మార్చవచ్చేమో.. కానీ నా మేధస్సును కాదు’ అని కౌంటర్ ఇచ్చింది.
కాగా ఈ సినిమా విడుదల సమయంలో పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థులపై ముసుగు ధరించిన దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో ఆ దాడులకు నిరసనగా నలుపు రంగులు ధరించిన దీపిక జేఎన్‌యూను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించింది. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేసిందంటూ పలువురు ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ట్విటర్‌లో #BoycottChhapaak అంటూ ఓ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ప్రతీకారంగా.. సినిమా రివ్యూలకు కేరాప్ అయిన ప్రఖ్యాత వెబ్‌సైట్ ఐఎమ్‌బీడీలో ఎక్కువ మంది.. తక్కువలో తక్కువ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో ఛపాక్ సినిమాకు ఆ వెబ్‌సైట్‌లో అతి తక్కువగా 4.6 రేటింగ్ నమోదైంది. అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఈ సినిమాను కొనియాడటం గమనార్హం. కాగా దీపిక ప్రస్తుతం ‘ద ఇంటర్న్’ అనే హాలీవుడ్ రీమేక్‌కు ఓకే చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment