యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపిక పదుకొనే లీడ్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. శుక్రవారం(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిమీయర్ షోకి వెళ్లిన దీపికా భర్త, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ భావోద్వేగానికి లోనవుతూ దీపిక, చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. దర్శకురాలు మేఘనా గుల్జార్‌ను అభినందిస్తూ.. ‘ మేఘనా.. మీ చిత్రం ప్రేక్షకుల్లో.. జీవితంపై ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. సినిమా ద్వారా మంచి, చెడుల మధ్య రంగులు మారే మనిషి మానవత్వాన్ని చూపించారు. యాసిడ్ హింస వల్ల బాధితులు ఎదుర్కొనే కఠిన పరిస్థితులను నిశితంగా చూపించారు. నేను ఖచ్ఛితంగా చెప్పగలను.. రాజి, తల్వార్‌ల తరువాత ఛపాక్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఓ గొప్ప దర్శకురాలిగా నిలబెడుతుంది’ అంటూ రాసుకొచ్చాడు.
అదేవిధంగా దీపికా పదుకొనే గురించి చెబుతూ.. ‘మై బేబీ.. నువ్వు ఈ సినిమా కోసం నిరంతరం కృషి చేశావని చెప్పడానికి నేనే సాక్ష్యం. దీనిని రూపొందించడానికి నువ్వు ఇంజన్‌లా పనిచేశావు.. ‘ఛపాక్’కు నువ్వు ఆత్మ. నీ సినిమా కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్న చిత్రం. దీని కోసం నువ్వు, నీ టీమ్ భయాలను, సమస్యలను అధిగమించారు. అలాగే పరిస్థితులతో పోరాడి వాటిని అధిగమించి చివరకు నువ్వు, నీ చిత్ర బృందం కలిసి ప్రస్తుతం పరిశ్రమలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు’ అంటూ రణ్‌వీర్, దీపిక, చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. అలాగే ‘ఛపాక్’లో దీపికా పాత్రపై స్పందిస్తూ.. ‘నేను ఊహించిన దాని కంటే అద్భుతంగా నటించి నన్ను కదిలించావు. నీ నటన నన్ను ఆశ్చర్యపరించింది. బలహీనతకు బలాన్ని జోడించి మాల్తి పాత్రకు గౌరవాన్నితెచ్చావు. నేను నీ కంటే గొప్పవాడిని అని ఎన్నడూ గర్వించలేదు... ఐ లవ్ యూ బేబీ’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. కాగా రణ్‌వీర్ తన తల్లిదండ్రులు, దీపిక తల్లిదండ్రులతో కలిసి ఛపాక్ ప్రీమియర్ షోకు వెళ్లాడు. ఇక ఛపాక్‌కు దీపిక నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment