దీపిక మనసు... ‘దోసే’స్తారు!
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళి, ఇప్పుడు అంతర్జాతీయ సినిమాల్లోకి విస్తరించిన అభినయ రాశి, అందాల ఊర్వశి - దీపికా పదుకొనే. ఇంతకీ, అంత సన్నగా ఎలా ఉండగలుగుతున్నారు? ‘ఏది పడితే అది తినరేమో! సన్నగా ఉండడం కోసం పాపం కడుపు మాడ్చుకున్నంత పని చేస్తారేమో!’ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ, దీపికా పదుకొనే అంత పని చేయరు. ఇష్టం వచ్చినవన్నీ హాయిగా లాగించేస్తారు. కాస్తో కూస్తో కేలరీలు పెరిగితే... వర్కవుట్లు చేసుకుని, తగ్గించేయొచ్చనే ధీమా ఆమెకుంది. ఈ బెంగళూరు బ్యూటీ సొంత ఊరికి వెళ్లినప్పుడైతే రెచ్చిపోతారట!
ఆ విషయం గురించి దీపికా పదుకొనే చెబుతూ - ‘‘బెంగళూరు ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్నప్పుడు నాకు ఇంటి భోజనం గుర్తొచ్చేస్తుంది. మా అమ్మ నాకు నచ్చివన్నీ వండిపెడుతుంది. అలాగని నేను ఇంటి ఫుడ్‌కి మాత్రమే పరిమితం కాను. మా ఊళ్ళో సీపీఆర్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ దోసెలు చాలా రుచిగా ఉంటాయి. టేస్టీ టేస్టీ దోసెలతోనే భోజనప్రియుల మనసు దోచేస్తారక్కడ. ఫన్నీ అని మరో ప్లేస్ ఉంది. అక్కడ కూడా రకరకాల వంటలు వడ్డిస్తారు. ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికెళ్లి, కడుపు నిండా లాగించేస్తా’’ అన్నారు. అన్నట్లు, ఇంత ఎత్తుకు ఎదిగినా, ఈ అమ్మడికి మన వంటలంటేనే ఇష్టంలా ఉంది. ‘‘దక్షిణాది వంటకాల్లో నాకు ఇడ్లీ, ఉప్మా చాలా ఇష్టం. నాకు స్వయంగా ఉప్మా చేయడం వచ్చు. స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో అమ్మానాన్నలు బయటికెళ్లి, ఇంటికి తిరిగొచ్చే సమయానికి వేడి వేడి ఉప్మా తయారు చేసి, మార్కులు కొట్టేసేదాన్ని’’ అంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు దీపికా పదుకొనే.