
దిల్లుకు దుడ్డు దర్శకుడితో జీవీ
తమిళసినిమా; యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్ కుమార్ హీరోగా నటించింది తక్కువ,నటిస్తున్నది, నటించనున్నది చాలా ఎక్కువ. ఈయన నటించి తెరపైకి వచ్చిన నాలుగు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందడంతో అవకాశాలు వరుస కడుతున్నాయని చెప్పవచ్చు. తమిళ సినిమాలో ప్రామిసింగ్ హీరోగా మారిన జీవీ నటిస్తున్న బ్రూస్‌లీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తాజాగా అడంగాదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు మరో నూతన చిత్రానికి జీవీ పచ్చజెండా ఊపారు.
ఇంతకు ముందు సంతానంతో దిల్లుకు దుడ్డు చిత్రం చేసి సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు రామ్‌బాల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ హిట్ కాంబినేషన్‌లో నవ నిర్మాత స్టీఫెన్ తన స్టీవ్ కార్నర్ పతాకంపై చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ లొల్లుసభ కార్యక్రమాన్ని చూసి తాను చాలా ఎంజాయ్ చేశానన్నారు.
దర్శకుడు రామ్‌బాల టైమింగ్ కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్‌తో కూడిన సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయన్నారు. ఆయన తెరకెక్కించిన దిల్లుకు దుడ్డు చిత్రం ఇందుకు ఒక నిదర్శనం అని అన్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటుడు నటించనున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను నవంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నట్లు నిర్మాత స్టీఫెన్ వెల్లడించారు.