ధూమ్-3 రివ్యూ | Dhoom 3 - Movie Review | Sakshi
Sakshi News home page

ధూమ్-3 రివ్యూ

Published Fri, Dec 20 2013 1:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ధూమ్-3 రివ్యూ - Sakshi

ధూమ్-3 రివ్యూ

2003 సంవత్సరంలో ధూమ్ సిరీస్ ఆరంభమైంది. అప్పటి నుంచి ధూమ్ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడమే కాకుండా.. అభిమానులను సంపాదించుకుంది. ధూమ్ చిత్ర విజయం తర్వాత 2006లో ధూమ్2 చిత్రం విడుదలై బాలీవుడ్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ధూమ్ సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్లు విలన్ పాత్రలు పోషించి ఓ ట్రెండ్ స్వీకారం చుట్టారు. జాన్, హృతిక్ల తర్వాత అమీర్ ఖాన్ విలన్గా నటించడం, బాలీవుడ్లో ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందిన తొలి చిత్రంగా ధూమ్3 చిత్రం ఓ ప్రత్యేకతను చాటుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. 2013 సంవత్సరంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంగా ధూమ్3 డిసెంబర్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!


చికాగోలోని గ్రేట్ ఇండియన్ సర్కస్ అప్పుల్లో కూరుకుపోతుంది.  అప్పులను తీర్చడానికి చేసిన ప్రయత్నాలు ఇక్బాల్ వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ షికాగో అధికారులు మెప్పించలేకపోవడంతో గ్రేట్ ఇండియన్ సర్కస్ యజమాని ఇక్బాల్ (జాకీ ష్రాఫ్) ఆత్మహత్యకు చేసుకుంటాడు. దాంతో ఇక్బాల్ కొడుకు సాహిర్ (అమీర్ ఖాన్) ఏకాకి అవుతాడు.  తండ్రి మరణానికి, సర్కస్ కంపెనీ మూత పడటానికి కారణమైన బ్యాంక్ అధికారులపై సాహిర్ ప్రతీకారం తీర్చుకోవడానికి దొంగగా మారుతాడు.  వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను సాహిర్ కొల్లగట్టడం ప్రారంభించిన తర్వాత ఆ బ్యాంక్ దివాళా తీయడమే కాకుండా అమెరికన్ స్టాక్ మార్కెట్లో షేర్ విలువ దారుణంగా పడిపోవడానికి కారణమవుతాడు. ఓ భారతీయ దొంగను పట్టుకోవడానికి ముంబైలోని టాప్ పోలీస్ అధికారులు జై దీక్షిత్ (అభిషేక్ బచ్చన్), ఆలీ ఖాన్ (ఉదయ్ చోప్రా)లను అమెరికా రప్పిస్తారు.


అమెరికా చేరుకున్న జై, ఆలీ ఖాన్లు.... సాహిర్ను అడ్డుకోవడంలో సఫలమయ్యారా?, పోలీసుల కళ్లు గప్పి బ్యాంక్ను కొల్లగొట్టడానికి సాహిర్ ఎలాంటి ప్రణాళికలను అమలు పరిచారు. వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను దెబ్బ తీయడానికి సాహిర్ పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధూమ్3 చిత్రం.

సాహిర్ పాత్రలో అమీర్ ఖాన్ మరోసారి విశ్వరూపం చూపించాడు. ధూమ్ సిరీస్లో ఇప్పటి వరకు అమీర్ ఖాన్దే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. సర్కస్ కంపెనీ నడిపే యజమాని పాత్రలో అమీర్ భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు.  ట్యాప్ డాన్స్, మలంగ్ అనే పాటలో అమీర్ నృత్యాలు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకుపోతాయి. అమీర్ నటన అద్బుతం అని చెప్పడానికి ఈ చిత్రంలో ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయం. విలన్ పాత్రను కూడా ప్రేమించేంతగా అమీర్ నటన ఉంది.

పాటలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఆలియా పాత్రలో కత్రీనా కైఫ్ కనిపించింది.  కమ్లీ అనే పాటలో కత్రీనా వాహ్ అనిపించే రీతిలో ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో కత్రీనా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను పోషించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అమీర్ ముందు కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా.. కత్రీనా నటన ఈ చిత్రానికి అదనపు ఎస్సెట్.

ధూమ్ సిరీస్లో జై దీక్షిత్, ఆలీ ఖాన్ లుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. ఆలీ ఖాన్ పాత్రలో ఉదయ్ చోప్రా కామెడీ రొటిన్గా ఉంది. పోలీస్ ఆఫీసర్ జై పాత్రలో కొత్తదనం ఏమీ లేకపోయింది. అమీర్ తండ్రి ఇక్పాల్ పాత్రలో జాకీ ష్రాఫ్ గుర్తుంచుకునే పాత్రను పోషించాడు. ఈ చిత్రంపై గొప్ప ప్రభావం చూపే విధంగా ఉండే ఇక్బాల్ పాత్రను జాకీ తనదైన శైలిలో మెప్పించాడు.

ధూమ్ సిరీస్ లో తొలి రెండు భాగాలకు రచయిత గా పనిచేసిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్3కి దర్శకుడిగా అవతారమెత్తాడు. ధూమ్ సిరీస్ తోపాటు రావణ్, గురు, బ్లఫ్ మాస్టర్ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేసిన ఆచార్య తాను దర్శకత్వం వహించిన తషన్ చిత్రం ఘోర పరాజయాన్ని పొందింది. అయితే ఈసారి పక్కా ప్లానింగ్, స్ర్కిప్ట్, అన్ని విభాగాలను సరైన మార్గంలో నడిపించి ధూమ్3 చిత్రాన్ని ఓ సూపర్ హిట్ మూవీగా మలిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ధూమ్3 చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య  వంద శాతం సక్సెస్ అయ్యాడు. ధూమ్ సిరీస్లో ఈ చిత్రాన్ని అచార్య ది బెస్ట్ అనే విధంగా రూపొందించాడు. ధూమ్3 లో యాక్షన్ ఎపిసోడ్స్ను పక్కదారి పట్టించకుండా, అమీర్ ఖాన్, కత్రీనా ప్రేమ కథను చక్కగా చిత్రీకరించాడు. అయితే మూడు గంటల నిడివి ఉన్న చిత్రం సగటు ప్రేక్షకుడికి కొంత ఇబ్బందిగా అనిపించినా...ధూమ్3 చిత్ర కథనం రేసింగ్ తరహాలో ఎక్కడ ఆగకుండా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు సాగింది. ధూమ్ సిరీస్లో తనదైన మార్కు కనిపించేలా జాగ్రత్త పడ్డాడు ఆచార్య. 


ప్రీతమ్ సంగీతం, జూలియస్ పాకియమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని మరింత రిచ్గా ఉండేలా చేశాయి. సుదీప్ చటర్జీ కెమెరా పనితరం హాలీవుడ్ చిత్రాలకు తీసిపోని విధంగా ఉంది. రితేష్ సోని ఎడిటింగ్ లో కొన్ని లోపాలనుమిగితా విభాగాలు కనిపించకుండా చేశాయి. కోన్రాడ్ పాలమిసానో యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

2013 సంవత్సరం ముగింపులో 4 వేల ధియేటర్లలో విడుదలైన ధూమ్3 చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ధియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో ఆరంభమైంది. హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ధూమ్3 చిత్రం భారీ కలెక్షన్లు వసూలు చేయడం ఖాయం. అయితే ధూమ్3 కలెక్షన్లు ఏరేంజ్ మోత మోగిస్తాయో అని తెలుసుకోవడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement