చరణ్ని లైట్ తీసుకుంటున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చరణ్ కూడా బ్రూస్ లీ బాధ నుంచి అభిమానులను బయటికి తీసుకువచ్చేందుకు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.
అయితే దసర బరిలో భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న చరణ్కు ఇప్పుడు గట్టి పోటి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాను దసరకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ప్రకటించకపోయినా దసర రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక భారీ బడ్జట్తో తెరకెక్కుతున్న కన్నడ సినిమా జాగ్వర్ను అదే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నారు.
ప్రభుదేవ, సోనూసూద్, కోన వెంకట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అభినేత్రిని కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్, అభినేత్రి డబ్బింగ్ సినిమాలే అయినా భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. చరణ్ ధృవ రిలీజ్ అవుతున్నా, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ భారీ పోటి చరణ్ సినిమా మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.