మనీషా నటన నచ్చలేదా?
మనీషా నటన నచ్చలేదా?
Published Sun, Mar 9 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
వర్ధమాన హీరోయిన్ మనీషాయాదవ్‌కు చేదు అనుభవం ఎదురైందా? జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు శీను రామస్వామికి ఆమె నటన నచ్చలేదా? అలాంటప్పుడు ముందుగానే మూడు సార్లు అడిషన్లు జరిపి మనీషాను ఇదం పొరుల్ ఇవళ్ చిత్రానికి హీరోయిన్‌గా ఎందుకు ఎంపిక చేశారు? షూటింగ్ ప్రారంభం అయిన తరువాత ఆమెనెందుకు తొలగించాల్సి వచ్చింది? ఈ పరిణామంతో మనసు గాయపడిన నటి మనీషా యాదవ్ న్యాయం కోసం నటీనటుల సంఘాన్ని ఆశ్రయించనుందా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలు కోడంబాక్కంలో హల్‌చల్ చేస్తున్నాయి. తెన్‌మేర్కు పరువకాత్తు చిత్రంలో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నందుకున్న దర్శకుడు శీనురామసామి. నీర్‌పరవై చిత్రం తరువాత తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదం పొరుల్ ఇవళ్. విజయ్ సేతుపతి, విష్ణువిశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత లింగుసామి తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మనీషా నే పర్ఫెక్ట్
విజయ్ సేతుపతికి జంటగా వర్ధమాన నటి మనీషా యాదవ్‌ను ఎంపిక చేశారు. ఆమె ఇందులో కొండ ప్రాంతపు వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర పోషించనున్నట్లు, ఇంతకు ముందు మనీషా యాదవ్ నటించిన వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ చిత్రాల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని, తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు మనీషా యాదవ్‌నే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని దర్శకుడు శీను రామసామి చిత్ర ప్రారంభానికి ముందు వెల్లడించారు.
అభినయం
నచ్చలేదు
ఇదం పొరుల్ ఇవళ్ చిత్ర షూటింగ్ ఈ నెల మూడో తేదీన దిండుగల్‌లో ప్రారంభమైంది. ప్రారంభ దశలోనే నటి మనీషా యాదవ్ నటన దర్శకుడిని సంతృప్తి పరచలేదని ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, అలాంటి మనీషా యాదవ్ అభినయం, షార్ట్ సంభాషణల ఉచ్ఛరణ దర్శకుడు శీనురామస్వామికి నచ్చలేదని అందుకే ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.
అమర్యాదగా తొలగించారు
ఈ వ్యవహారం గురించి నటి మనీషా తల్లి యమునా సురేష్‌ను స్పందించాలని అడగ్గా ఇదం పొరుల్ ఇవళ్ చిత్రం విషయంలో సమస్య ఉత్పన్నమైన సంగతి నిజమేనన్నారు. అయితే ఇందులో మనీషా యాదవ్ తప్పు ఏమీ లేదని పేర్కొన్నారు. ఆమెను అమర్యాదగా చిత్రం నుంచి తొలగించారని ఆరోపించారు. మనీషా యాదవ్ సరిగ్గా నటించలేదన్నది నిజం కాదన్నారు. ఈ చిత్రానికి ఎంపిక చేసే విషయంలో దర్శకుడు శీను రామసామి, మనీషాను మూడు దశలుగా ఆడిషన్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు దర్శకుడికి తెలియదా? ఆ పాత్రకు ఆమె నప్పుతారా? లేదా? అన్నది అని ప్రశ్నించారు. నిజానికి తాము మూడు రోజుల క్రితమే చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నామని వెల్లడించారు. ఆ రోజు కూడా షూటింగ్ సక్సెస్ అయ్యే ముందు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు మనీషా సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు. అరగంట షూటింగ్‌లోనే ఆమె అభినయం గురించి దర్శకుడు జడ్జ్ చేయగలరా? అంటూ ప్రశ్నించారు. మరుసటి రోజునే ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ చేత బెంగళూరుకు టికెట్ పంపించడం నిరాధారంగా చిత్రం నుంచి తొలగించడం బాధాకరం అన్నారు.
Advertisement
Advertisement