తమిళసినిమా: భిన్నమైన భావాల యువతి, యువకుల మధ్య ప్రేమ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘రీల్’ అని ఆ చిత్ర దర్శకుడు మునుస్వామి తెలిపారు. శ్రీ మురుగన్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఉదయరాజ్, నటి అవంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. విజయ్ టీవీ ఫేమ్ శరత్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్‌చంద్రన్ అందించగా నేపథ్య సంగీతాన్ని అచ్చు రాజామణి అందించారు. నోబెల్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం చెన్నైలోని ప్రసాద్ 70 ఎంఎం థియేటర్‌లో విలేకరులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ జీవితంలో లక్ష్యం లేని యువకుడికీ, పేదరికంలో పుట్టిన యువతికి మధ్య పరిచయం, ప్రేమ ఇతివృత్తమే రీల్ చిత్రం అని తెలిపారు. పల్టెటూరుకు చెందిన కథానాయకి సిటీకి వచ్చి కొందరు బడాబాబుల కంట పడి సమస్యల్లో చిక్కుకుంటే ఆమెను కథానాయకుడు ఎలా కాపాడాడు? అన్నదే చిత్ర సింగిల్ లైన్ కథ అని చెప్పారు. చిత్రంలో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు ఉదయరాజ్ మాట్లాడుతూ కేరళాకు చెందిన తనకు తమిళంలో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. తాను ఇంతకు ముందు 10 లఘు చిత్రాల్లో నటించానని, అందులో ఒక లఘు చిత్రాన్ని చూసి ఈ చిత్ర దర్శక,నిర్మాతలు పిలిచి హీరోగా అవకాశం ఇచ్చారని నటుడు ఉదయరాజ్ చెప్పారు. చిత్ర నిర్మాణం పూర్తయ్యిందని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment