
అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: రాజకీయాల్లో ఇదంతా సాధారణమయ్యా! (అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా) పేరుతో ఒక విభిన్న కథా చిత్రం రూపొందింది. ఇందులో రాజతందిరం చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన వీరా కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా కూక్కూ చిత్రం ఫేం మాళవిక మీనన్ కథానాయకిగా నటించింది. చాలా చిత్రాలను నిరాకరించిన ఈమె ఈ చిత్ర కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. వాణిజ్య ప్రకటన రంగంలో పేరు గాంచిన అవినాశ్ హరిహరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పంపిణీ రంగంలో నమ్మకమైన సంస్థగా పేరు గాంచిన ఆరా సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా.
ఈ సంస్థ అధర్వ, హన్సిక జంటగా 100 అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే విధంగా త్వరలో ఆది హీరోగా తెలుగులో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్‌ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేయనుంది. కాగా అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా చిత్ర వివరాలను నిర్మాత కావ్య వేణుగోపాల్ తెలుపుతూ ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. చిత్రం గురించి తెలిసిన వెంటనే క్లాప్‌బోర్డు సంస్థ అధినేత సత్యమూర్తి తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరున లేదా, సెప్టెంబరు తొలివారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నటుడు పశుపతి, రోబోశంకర్, నాన్ కడవుల్ రాజేంద్రన్, సేతన్, షారా ముఖ్య పాత్రలను పోషించారు. మ్యాడ్లీ బ్లూస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపడుతున్నారు..
Comments
Please login to add a commentAdd a comment