‘వెలకమ్ టు న్యూయార్క్’... ఐఫా అవార్డ్స్ మీద వచ్చిన స్పూఫ్ అని చెప్పొచ్చు. వెంకటేష్, కమల్‌హసన్ నటించిన ‘ఈనాడు’ సినిమా దర్శకుడు చక్రి తోలేటి నిర్దేశకత్వంలో వచ్చిన చిత్రం వెల్‌కమ్ టు న్యూయార్క్. నిజానికిది పారిస్ ఫ్యాషన్ వీక్ మీద రాబర్ట్ అల్ట్‌మన్ తీసిన ‘ప్రెట్ ఎ పోర్టర్’ సినిమాకు రీమేక్ లాంటిదని చెప్పొచ్చు. ఫ్యాషన్ వీక్ చోట ఐఫా అవార్డ్ ఫంక్షన్ ఉంది అంతే.
కథ..
సోఫియా (లారా దత్తా) ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను నిర్వహించే సంస్థ ఎంప్లాయి. గ్యారీ (బొమన్ ఇరానీ) ఆమె బాస్. పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా అహోరాత్రులు కష్టపడి ఆ సంస్థను నిలబెడుతుంది. అంత కష్టపడ్డా తనకు రావల్సిన వాటా ఇవ్వడు గ్యారీ. ఈసారి జరగబోయే ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ ఫెయిల్ చేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఇండియాలో టాలెంట్ సెర్చ్ పెట్టి జీనల్ పటేల్ (సోనాక్షి సిన్హా), తేజి (దిల్జిత్)లను ఎంపిక చేస్తుంది. వాళ్లు గొప్ప ప్రతిభావంతులని కాదు.. ఎందుకూ పనికిరారని.
ఇంతకీ ఆ ఇద్దరికున్న టాలెంట్ ఏంటీ?
జీనల్ పటేల్.. యాంబిషియస్ గుజ్జి గర్ల్. డ్రెస్ డిజైనర్. గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలని.. ఎలాగైనా సరే బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారాలని కలలు కంటుంది.. కష్టపడుతుంటుంది. తేజీ విషయానికి వస్తే.. రికవరీ ఏజెంట్. యాక్టింగ్ అంటే పిచ్చి. అద్దాన్ని చూస్తే అతనిలో ఉన్న నటుడు నిద్రలేస్తాడు. బాలీవుడ్‌లోని నటులను అనుకరిస్తూ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. జీనల్ డ్రెస్ డిజైనింగ్, తేజ్ నటనతో పంపిన వీడియోలను ఫస్ట్ రౌండ్‌లోనే రిజెక్ట్ చేసేస్తారు. తన బాస్ మీద రివేంజ్ తీసుకోదల్చిన సోఫియా వాటిని ఏరి ఓకే చేస్తుంది. న్యూయార్క్‌లో జరగబోయే ఐఫా అవార్డ్స్‌కు టికెట్స్, హోటల్ గదులు బుక్ చేసి వాళ్లకు ఆహ్వానం పంపుతుంది.
ఇంకో వైపు..
ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు యాంకర్స్‌గా కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను పిలుస్తారు. కరణ్‌జోహార్.. ఫ్యాషన్ ఫ్రీక్.. బ్రాండ్స్ అంటే పడి చస్తుంటాడు. అయితే కరణ్‌కు ఓ కవల సోదరుడు ఉంటాడు. అతని పేరు అర్జున్. న్యూయార్క్‌లో అతనో గ్యాంగ్‌స్టర్. కరణ్ జోహార్ తీసిన కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి సినిమా అభిమానులు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, మ్యాన్ హటన్ లాంటి వీథుల్లో అర్జున్ తిరుగుతుంటే జనాలు భయపడకపోగా.. కరణ్.. కరణ్ అంటూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం వెంటపడుతుంటారు.
ఇది అర్జున్‌కు చాలా కోపం తెప్పిస్తుంది. తన దందాను పాడు చేస్తున్నాడు అని కరణ్ మీద చిరాకు కలుగుతుంది. ఎలాగైనా కరణ్‌ను చంపాలనుకుంటాడు. ఐఫా అవార్డ్స్‌కు న్యూయార్క్ వస్తున్నాడని తెలుసుకొని ఆ టైమ్‌ను వినియోగించుకోవాలనుకుంటాడు. కాని కథ అడ్డం తిరిగి అర్జున్ ప్లాన్ పాడవుతుంది. అతను కటకటాల్లో చిక్కుకుంటాడు. కరణ్, రితేష్‌తో కలిసి హోస్ట్ చేసి ఐఫా అవార్డ్ ఫంక్షన్‌ను హిట్ చేస్తాడు. ఆ షోను వరెస్ట్ షోగా చూపించాలనుకున్న సోఫియా కుట్రను అర్థం చేసుకున్న జీనల్, తేజీలు అలా కానివ్వకుండా నిజంగానే తమ టాలెంట్‌ను చూపిస్తారు. సల్మాన్‌కు డ్రెస్ డిజైన్ చేసి జీనల్, షోలో తన అభినయ కౌశలం చూపించి తేజీలు తమలో ప్రతిభ ఉందని రుజువు చేస్తారు.
టీవీ షోకి కొనసాగింపుగా..
సినిమా అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వెనక ఉన్న డ్రామా, డబ్బు వంటి విషయాలను హాస్యరసప్రధానంగా తెరకెక్కించే ప్రయత్నమే వెల్‌కమ్ టు న్యూయార్క్. కరణ్ జోహార్ తన సినిమాల మీద తానే సెటైర్ వేసుకుంటుంటాడు. బాలీవుడ్ స్టార్స్ మీద వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అయితే ఈమాత్రం టీవీ షోల్లో, టీవీల్లోనే ప్రసారమయ్యే స్టాండప్ కామెడీ షోలో చాలా కనపడుతున్నాయి. దీన్ని సినిమాగా తీస్తున్నప్పుడు చక్రీ తోలేటి ఇంకాస్త పకడ్బందీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను పెట్టుకుంటే బాగుండేది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తెలుగువారికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment