స్వగ్రామం కనకాలపేట వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కనకాల దేవదాసు
సాక్షి, తూర్పుగోదావరి(కనకాలపేట) : సినీ నటుడు, దర్శకుడు కనకాల దేవదాసు మృతి చెందారన్న వార్త తెలియడంతో.. యానాం నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం కనకాలపేటలో శుక్రవారం విషాదం నెలకొంది. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలను, ఆయనతో గడిపిన క్షణాలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో గొప్ప మేధావిగా గుర్తింపు పొంది.. అనేకమందికి నటనలో శిక్షణ ఇచ్చి, సినీరంగానికి అగ్రశ్రేణి నటులను ఇచ్చిన ఆయన.. బతుకు తెరువు రీత్యా దూరతీరాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామం కనకాలపేటతో అనుబంధాన్ని కొనసాగించేవారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం కనకాలపేట ఎప్పుడు వచ్చినా బంధువులు, స్నేహితులతో గడిపేవారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. ఆయన వల్లనే తమ కనకాలపేట గ్రామానికి మంచి పేరు వచ్చిందని చెప్పారు.
కనకాలపేటలో 25 సంవత్సరాల క్రితం కోదండరామాలయం పునర్నిర్మాణం జరిగిన సమయంలో దేవతామూర్తుల విగ్రహాలను కనకాల దేవదాసు ప్రత్యేకంగా తెప్పించి, ఆయన తల్లిదండ్రులతో ప్రతిష్ఠింపజేశారు. అనంతరం 11 సంవత్సరాల క్రితం ఉత్సవాల నిర్వహణకు శాశ్వతగా నిధిగా రూ.లక్ష ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. దేవదాసు పర్యవేక్షణలో శ్రీరామనవమి రోజున ఆయన కుమారుడు రాజీవ్, కోడలు, ప్రఖ్యాత బుల్లితెర యాంకర్ సుమలతో ఐదేళ్ల కిందట కోదండ రామాలయంలో కల్యాణం నిర్వహించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హంసాని రామలక్ష్మణుడు ‘సాక్షి’కి చెప్పారు. కనకాల దేవదాసు మృతి పట్ల గ్రామస్తులు సంతాపం తెలిపారు.
ఎంతోమందికి మార్గదర్శకుడు
కనకాల దేవదాసు నటనలో ఎంతోమందికి ఓనమాలు నేర్పించి సినీరంగంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని ఆయన సోదరుడు కనకాల రామదాసు అన్నారు. యానాంలోని తన నివాసంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మొన్ననే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, ఈలోగా ఇటువంటి విషాద వార్త వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనకాల దేవదాసుతో పరిచయాన్ని స్థానికుడు సాధనాల బాబు కూడా గుర్తు చేసుకున్నారు. దేవదాసు మృతికి యానాం తెలగ, కాపు అభ్యుదయ సంఘం తీవ్ర సంతాపం తెలిపింది.
1945లో జననం
కనకాల దేవదాసు కనకాలపేట గ్రామంలో 1945 జూలై 30న కనకాల తాతయ్య, మహాలక్ష్మమ్మలకు జన్మించారు. తాతయ్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉండగా మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 1971 నవంబర్‌లో లక్ష్మీదేవితో కనకాల దేవదాసుకు వివాహమైంది. లక్ష్మీదేవి గత సంవత్సరం ఆగస్టు 2న మరణించారు. కనకాల దేవదాసుకు కుమారుడు రాజీవ్, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. దేవదాసు విద్యాభ్యాసమంతా యానాం, కాకినాడ, విశాఖపట్నంలలో సాగింది. యానాంలోని సెంట్రల్ బాలుర హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదువుకున్నారు.
అనంతరం కాకినాడ పీఆర్‌జీ కళాశాలలో పీయూసీ, విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో బీఏ (హెచ్‌ఈపీ) చదివారు. నటన పట్ల మక్కువతో 1965లో ఆంధ్రా యూనివర్సిటీలో డిప్లమో ఇన్ యాక్టింగ్ చేశారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో 1966–67లో శిక్షణ పొందారు. అనంతరం ఏపీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించి నటనలో అనేకమందికి శిక్షణ ఇచ్చి, అగ్రశ్రేణి నటులుగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment