Devadas kanakala
-
యాంకర్ సుమ ఆడపడుచు మృతి
సాక్షి,హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..) -
దేవదాస్ కనకాలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు దేవదాస్ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. -
దేవదాస్ కనకాలకు నివాళి
-
దేవదాస్ కనకాలకు చిరంజీవి నివాళి
సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తన ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ద్వారా ఎంతో మంది స్టార్స్‌ను అందించిన ఆయనకు తెలుగు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. దేవదాస్ కనకాల దగ్గర నటనలో శిక్షణ పొందిన మెగాస్టార్ చిరంజీవి ఆయన భౌతికకాయనికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాధ్, దర్శకుడు రాజమౌళి, గాయకుడు బాలసుబ్రమణ్యం, బ్రహ్మాజీ, హేమ, అనితా చౌదరిలతో పాటు పలువురు టీవీ నటులు కూడానివాళులర్పించిన వారిలో ఉన్నారు. యువ కథానాయకుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘వేలాదిమంది ఆర్టిస్టులను తయారు చేసిన గురువుగారు మా దేవదాస్ కనకాల గారు. ఆ వేల మందిలో నేనూ ఒకడిని. ఎందరికో మార్గదర్శి అయిన మా గురువు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ కనకాల గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించమని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దేవదాస్ కనకాల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ‘దేవదాస్ కనకాల గారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు. ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చి, వాళ్లు నటులుగా పేరు సంపాదించుకోవడంలో పాలు పంచుకున్న గురువు కూడా. ఇటీవలే ఆయనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సత్కరించింది. ఇంతలోనే ఆయన ఇలా అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధాకరం. దేవదాస్ కనకాల గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని తెలిపింది. -
‘కనకాల’పేటలో విషాదం
సాక్షి, తూర్పుగోదావరి(కనకాలపేట) : సినీ నటుడు, దర్శకుడు కనకాల దేవదాసు మృతి చెందారన్న వార్త తెలియడంతో.. యానాం నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం కనకాలపేటలో శుక్రవారం విషాదం నెలకొంది. సినీ కళామతల్లికి ఆయన చేసిన సేవలను, ఆయనతో గడిపిన క్షణాలను స్థానికులు గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో గొప్ప మేధావిగా గుర్తింపు పొంది.. అనేకమందికి నటనలో శిక్షణ ఇచ్చి, సినీరంగానికి అగ్రశ్రేణి నటులను ఇచ్చిన ఆయన.. బతుకు తెరువు రీత్యా దూరతీరాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామం కనకాలపేటతో అనుబంధాన్ని కొనసాగించేవారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం కనకాలపేట ఎప్పుడు వచ్చినా బంధువులు, స్నేహితులతో గడిపేవారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. ఆయన వల్లనే తమ కనకాలపేట గ్రామానికి మంచి పేరు వచ్చిందని చెప్పారు. కనకాలపేటలో 25 సంవత్సరాల క్రితం కోదండరామాలయం పునర్నిర్మాణం జరిగిన సమయంలో దేవతామూర్తుల విగ్రహాలను కనకాల దేవదాసు ప్రత్యేకంగా తెప్పించి, ఆయన తల్లిదండ్రులతో ప్రతిష్ఠింపజేశారు. అనంతరం 11 సంవత్సరాల క్రితం ఉత్సవాల నిర్వహణకు శాశ్వతగా నిధిగా రూ.లక్ష ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. దేవదాసు పర్యవేక్షణలో శ్రీరామనవమి రోజున ఆయన కుమారుడు రాజీవ్, కోడలు, ప్రఖ్యాత బుల్లితెర యాంకర్ సుమలతో ఐదేళ్ల కిందట కోదండ రామాలయంలో కల్యాణం నిర్వహించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హంసాని రామలక్ష్మణుడు ‘సాక్షి’కి చెప్పారు. కనకాల దేవదాసు మృతి పట్ల గ్రామస్తులు సంతాపం తెలిపారు. ఎంతోమందికి మార్గదర్శకుడు కనకాల దేవదాసు నటనలో ఎంతోమందికి ఓనమాలు నేర్పించి సినీరంగంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని ఆయన సోదరుడు కనకాల రామదాసు అన్నారు. యానాంలోని తన నివాసంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మొన్ననే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, ఈలోగా ఇటువంటి విషాద వార్త వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనకాల దేవదాసుతో పరిచయాన్ని స్థానికుడు సాధనాల బాబు కూడా గుర్తు చేసుకున్నారు. దేవదాసు మృతికి యానాం తెలగ, కాపు అభ్యుదయ సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. 1945లో జననం కనకాల దేవదాసు కనకాలపేట గ్రామంలో 1945 జూలై 30న కనకాల తాతయ్య, మహాలక్ష్మమ్మలకు జన్మించారు. తాతయ్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉండగా మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 1971 నవంబర్‌లో లక్ష్మీదేవితో కనకాల దేవదాసుకు వివాహమైంది. లక్ష్మీదేవి గత సంవత్సరం ఆగస్టు 2న మరణించారు. కనకాల దేవదాసుకు కుమారుడు రాజీవ్, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. దేవదాసు విద్యాభ్యాసమంతా యానాం, కాకినాడ, విశాఖపట్నంలలో సాగింది. యానాంలోని సెంట్రల్ బాలుర హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకూ చదువుకున్నారు. అనంతరం కాకినాడ పీఆర్జీ కళాశాలలో పీయూసీ, విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో బీఏ (హెచ్ఈపీ) చదివారు. నటన పట్ల మక్కువతో 1965లో ఆంధ్రా యూనివర్సిటీలో డిప్లమో ఇన్ యాక్టింగ్ చేశారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో 1966–67లో శిక్షణ పొందారు. అనంతరం ఏపీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించి నటనలో అనేకమందికి శిక్షణ ఇచ్చి, అగ్రశ్రేణి నటులుగా తీర్చిదిద్దారు. -
దేవదాస్ కనకాల ఇక లేరు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నటుడు, నటన శిక్షకుడు దేవదాస్ కనకాల (75) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్ను మూశారు. గత నెల 27న కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీనికితోడు పలు అవయవాలు పనిచేయకపోవడంతో.. దేవ దాస్ కనకాల మృతి చెందారు. ఆయనకు కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. రాజీవ్ సినీ నటుడిగా, కోడలు సుమ టీవీ యాంకర్‌గా సుపరిచితులు. నటుల ఫ్యాక్టరీ తూర్పు గోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 1945 జూలై 30న కనకాల పాపయ్య నాయుడు, మహాలక్ష్మమ్మ దంపతులకు దేవదాస్ జన్మించారు. యానాం శివారులోని కనకాలపేట ఆయన స్వగ్రామం. దేవదాస్ తండ్రి పాపయ్య.. ఫ్రెంచి పాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. నటుడిగా, శిక్షకుడిగా దేవదాస్ కనకాల ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చలిచీమలు, నాగమల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో దేవదాస్ నటించారు. చివరగా ‘భరత్ అనే నేను’చిత్రంలోనూ కనిపించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటుచేసి నటనలో శిక్షణనిచ్చారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, భానుచందర్, రఘువరన్, నాజర్, తదితర ప్రముఖులు దేవదాస్ శిష్యులే. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించారు. 2018లో సతీమణి లక్ష్మి మృతిచెందడం ఆయన్ను కలిచివేసింది. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ నటులు కొండా పూర్లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం ఆస్పత్రిలోనే ఉంచారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మణికొండలోని స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీఎం సంతాపం సీనియర్ నటుడు దేవదాసు కనకాల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నటన శిక్షణ సంస్థను నెలకొల్పి ఎందరినో సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దేవదాసు కనకాల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
నట గురువు ఇక లేరు
రజనీకాంత్, చిరంజీవి ఇప్పటి సూపర్‌స్టార్స్. కానీ వాళ్లకు నటనలో ఓనమాలు దిద్దించిన నటగురువు దేవదాస్ కనకాల. వీరే కాదు రాజేంద్రప్రసాద్, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రఘువరన్, రాంకీ వంటి నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవదాస్ కనకాల ప్రయాణం సాగింది. నిన్నటితో ఆ ప్రయాణం ఆగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం దేవదాస్ కనకాల మృతి చెందారు. 1945 జూలై 30 యానాంలోని కనకాల పేటలో కనకాల పాపయ్య, మహాలక్ష్మికి జన్మించారు. ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు వీరి తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. దేవదాస్ కనకాల విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సినిమా కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యనభ్యసించిన తర్వాత నటనలో శిక్షణ కేంద్రం స్థాపించారు. ఎందరో నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పంపించారాయన. చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటుడిగా ‘ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్‌లీడర్, మంచు పల్లకి. అమ్మో ఒకటో తారీఖు, మల్లీశ్వరీ, కింగ్, అసాధ్యుడు’ వంటి సినిమాల్లో నటించారు. ‘అమృతం’ టీవీ సీరియల్లో కూడా నటించారు. ‘చలి చీమలు, నాగవల్లి’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురుదక్షిణగా రజనీకాంత్ తన డేట్స్ ఇచ్చినప్పటికీ దేవదాస్ కనకాల తిరస్కరించారట. 1971 నవంబర్ 21న లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు రాజీవ్ కనకాల, శ్రీ లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ ప్రముఖ యాంకర్. శ్రీ లక్ష్మి నాటక రంగ ప్రముఖులు డా. పెద్ది రామారావును వివాహం చేసుకున్నారు. 2018లో దేవదాస్ భార్య లక్ష్మీ దేవి మరణించారు. భార్య దూరం అయిన బాధలో దేవదాస్ ఎక్కువ శాతం ఇంటికే పరిమితం అయ్యారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్ కనకాల మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శనివారం ఉదయం మణికొండలోని స్వగృహానికి దేవదాస్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తారు. ఉదయం 11.30. తర్వాత అంత్యక్రియలు ఆరంభమవుతాయి. భార్య లక్ష్మీదేవి, కొడుకు, కోడలు రాజీవ్, సుమలతో...దేవదాస్ కనకాల -
సినీనటుడు దేవదాస్ కనకాల మృతి
-
సీనియర్ నటుడు దేవదాస్ కనకాల మృతి
సీనియర్ నటుడు, రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల(74) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవదాస్ కనకాల.. శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. గతేడాది ఫిబ్రవరిలో దేవదాస్ కనకాల భార్య లక్ష్మీ దేవి కనకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన తొలితరం నటుల్లో దేవదాస్ కనకాల ఒకరు. దేవదాస్ కనకాల హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి ఈ తరం వారకి నటనలో శిక్షణ ఇస్తున్నారు.చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖ నటుల చేత ఒకప్పుడు దేవదాస్ కనకాల నటనలో ఓనమాలు దిద్దించారు. దేవదాస్ కనకాల 1945లో జూలై 30న యానాంలో జన్మించారు. దేవదాస్ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ. దేవదాస్ కనకాలకు ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టీవీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. పెద్ది రామారావుతో జరిగింది. చలి చీమలు, నాగమల్లి వంటి చిత్రాలకు దేవదాస్ కనకాల దర్శకత్వం వహించారు. ఓ సీత కథ, భలే దంపతులు, మనసంతా నువ్వే, శ్రీరామ్, పెదబాబు, అమ్మో ఒకటో తారీఖు, సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్ కనకాల నటించారు. భరత్ అనే నేను ఆయన నటించిన చివరి చిత్రం. రేపు అంత్యక్రియలు దేవదాస్ కనకాల పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తెసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కనకాల భౌతికకాయాన్ని ఇంటి దగ్గరే ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ప్రముఖ నటుడి స్థలం కబ్జా
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ సుమా మామా, ప్రముఖ నటుడు దేవదాసు కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. దాంతో దేవదాసు కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల బుధవారం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని దేవదాసు కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే హయత్‌నగర్‌లోని భూమికి చేరుకుని... దుండగులకు వెళ్లిపోమ్మని ఆదేశించారు. అందుకు దుండగులు ససేమిరా అనడంతో.. దేవదాసు కనకాల, రాజీవ్ కనకాల హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.