దేవదాస్ కనకాలకు అంతిమ నివాళులు అర్పించి, రాజీవ్ కనకాలను ఓదారుస్తున్న ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ చిరంజీవి, టీవీ నటులు
హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు దేవదాస్ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment