సాక్షి, తమిళసినిమా: దర్శకుడు బాలా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్‌కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. తొలిసారిగా ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించడం గతంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేయాలని ఆయన భావించారు. వర్మ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసినప్పటికీ.. చిత్రీకరణ అంతా పూర్తయిన తరువాత నిర్మాతలు ఇది అసలు అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌లా లేదు, బాలా సరిగా తీయలేదంటూ పక్కన పడేశారు. నూతన దర్శకుడితో ఆదిత్యవర్మ పేరుతో మళ్లీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇంతకంటే బాలాకు జరిగిన అవమానం వేరే ఉండదు. దీంతో ఆయన చాలా కసిగా ఒక కథను తయారు చేశారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇది మల్టీస్టారర్ సినిమా. ఇందులో నటించడానికి సూర్య సమ్మతించినట్లు సమాచారం. అంతేకాదు మరో హీరోగా నటుడు ఆర్య, అధర్వ కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు ఇంతకుముందు బాలా దర్శకత్వంలో నటించినవారే. వారిప్పుడు ఆయనకు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాహుబలి ఫేమ్ రానాను నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇక కథానాయికలుగా మహిమ, బిందుమాధవి నటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలన్న కసి, పట్టుదలతో బాలా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment