అంతకు మించి హిట్ ఇవ్వాలనుకుంటున్నాం | Director Jaya doiing Movie 'visakham' | Sakshi
Sakshi News home page

అంతకు మించి హిట్ ఇవ్వాలనుకుంటున్నాం

Published Mon, May 30 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

అంతకు మించి హిట్ ఇవ్వాలనుకుంటున్నాం

అంతకు మించి హిట్ ఇవ్వాలనుకుంటున్నాం

- నిర్మాత బీఏ రాజు
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొద్ది మంది డైనమిక్ లేడీ డెరైక్టర్స్‌లో జయ. బి ఒకరు. ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నఆమె తాజాగా ‘వైశాఖం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె సినిమాస్ పతాకంపై సూపర్‌హిట్ అధినేత బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 ఈ సందర్భంగా బీఏ రాజు మాట్లాడుతూ -‘‘ ‘లవ్‌లీ’ చిత్రం ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అంతకంటే పెద్ద హిట్ సినిమా తీయాలనే తపనతో మంచి కథ కోసం గ్యాప్ తీసుకున్నాం. గతంలో మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ మంచి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ‘వైశాఖం’లో పాటలు కూడా అందరికీ నచ్చుతాయి. రష్యా నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడ్డ కజికిస్థాన్‌లో ఈ చిత్రం కోసం మూడు పాటలను పదిహేను రోజుల్లో చిత్రీకరించాం. ఇప్పటివరకూ అక్కడ ఎవరూ షూటింగ్ జరపలేదు. సాయికుమార్, ఆమని, పృధ్వీ, కాశీ విశ్వనాథ్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అని చెప్పారు. దర్శకురాలు జయ మాట్లాడుతూ- ‘‘కజికిస్థాన్‌లో మైనస్ 4 డిగ్రీల టెంపరేచర్‌లో పాటలను చిత్రీకరించాం.

కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అపార్ట్‌మెంట్‌లోని వాళ్లు ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటే ఎంత హాయిగా ఉంటుందో సెంటిమెంట్ గా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తున్నాం. కంట్రోల్ బడ్జెట్‌లో ఈ చిత్రం చేయాలనుకుంటే పెద్ద చిత్రంగా తయారవుతోంది. కథను నమ్మి రాజుగారు బడ్జెట్ విషయంలో రాజీపడటం లేదు. షూటింగ్ అరవై శాతం పూర్తయింది. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. హీరో హరీష్, కెమేరామ్యాన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ బి.శివకుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement