దర్శకురాలైన షకీలా | director shakeela | Sakshi
Sakshi News home page

దర్శకురాలైన షకీలా

Published Sat, Jun 14 2014 12:27 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

దర్శకురాలైన షకీలా - Sakshi

దర్శకురాలైన షకీలా

శృంగార తారగా ఉర్రూతలూపిన షకీలా ఇప్పుడు కొత్త అవతారమెత్తారు. నిన్న మొన్నటి దాకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టారు. తొలిసారిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని సిగ్నేచర్ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం వివరాలను షకీలా, నిర్మాణ బృందం వివరించారు. ‘‘దర్శకత్వం వహించాలన్నది చాలా రోజులుగా నా కోరిక. అది ఇన్నాళ్ళకు తీరింది.

ఈ చిత్రంతో దర్శకురాలిగా నా ప్రయాణం మొదలైంది’’ అని షకీలా అన్నారు. ‘‘కథానాయిక ప్రధానంగా సాగే ఈ చిత్రానికి’’ కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా షకీలావే కావడం విశేషం. ‘‘దాదాపు 20 ఏళ్ళుగా సినీ రంగంలో నటుడిగా ఉన్నా. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి, అఫ్జల్ సమర్పణలో, వెంకటేశ్వరరావు, బాబా, కట్టా శ్రీకర్ ప్రసాద్ తదితరుల సహకారంతో ఈ సినిమాను తీస్తున్నా’’ అని నిర్మాత మెంటా సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రం తెలుగు రూపంలో నరేశ్ (అలియాస్ నరేంద్ర) హీరో కాగా, హిందీ వెర్షన్‌లో కథానాయక పాత్రను పాత తరం సినీ విలన్ నాగభూషణం మనుమడైన భూషణ్ పోషిస్తున్నారు.

‘‘ఎంతో అనుభవమున్న దర్శకురాలి లాగా ఈ చిత్రాన్ని ఎంతో బాగా షకీలా అక్క తీశారు’’ అని భూషణ్ చెప్పారు. శ్వేత, శ్రీదేవి ఈ చిత్రంలో కథానాయికలు. ‘‘ఏప్రిల్ 20 నుంచి జూన్ 12 మధ్య దాదాపు 50 రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల విభిన్న లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తన 113వ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్న సీనియర్ కెమేరామన్ కంకణాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభిషేక్, కార్తీక్‌లు సంగీతం అందించగా, నందమూరి బెనర్జీ కూర్పు జరుపుతున్న ఈ చిత్రంలో షకీలా సైతం కానిస్టేబుల్‌గా ఓ భిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ‘‘అత్యాచారాలు, అన్యాయాలను మహిళే ఎదిరిస్తే ఎలా ఉంటుందన్నది నాదైన శైలిలో తీశా’’ అంటున్న షకీలా డెరైక్టర్‌గానూ సంచలనం రేపుతారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement