
మహిళా దర్శకురాలు లీనా మణిమేఘలపై మరో దర్శకుడు సుశీగణేశన్ పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే మీటూ సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలో తిరుట్టుప్పయలే, కందస్వామి చిత్రాల దర్శకుడు సుశీగణేశన్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
వాణిజ్య ప్రకటనల దర్శకురాలు లీనామణిమేఘల దర్శకుడు సుశీగణేశన్ కారులో వెళుతుండగా తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆమె ఆరోపణలు ఖండించిన సుశీగణేశన్, లీనా మణిమేఘల తన వద్ద సహాయదర్శకురాలిగానూ, రచయితగానూ అవకాశాలు కోరిందన్నారు. తాను ఆమెకు అవకాశం కల్పించకపోవడంతో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.
తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఏర్పరచే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆయన ఆన్‌లైన్ ద్వారా స్థానిక సెయింట్ థామస్ మౌంట్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌కు దర్శకురాలు లీనా మణిమేఘలపై ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా బుధవారం సుశీగణేశన్ స్థానిక సైదాపేట మేట్రోపాల్టిన్ కోర్టులో దర్శకురాలు లీనా మణిమేఘలపై పరువు నష్టం దావా కేసు వేశారు. అందులో దర్శకురాలు లీనా మణిమేఘల తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఆపాదించేలా నిరాధార ఆరోపణలు చేశారని, దీని వల్ల తాను మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.
కాబట్టి భారతీయ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన ఈ కేసు విచారణకు రానుంది. కాగా దర్శకురాలు లీనా మణిమేఘల కూడా తాను సుశీగణేశన్ బెదిరింపులకు భయపడనని, ఆయన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.