
ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందట!
గట్టిగా మూడు సినిమాలు చేసిందో లేదో గానీ.. అప్పుడే ఆ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందట. పూరి జగన్నాథ్ తీసిన లోఫర్ సినిమాతో పాటు.. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ', ఓ మాదిరి విజయం పొందిన 'కుంగ్‌ఫూ యోగ' సినిమాల్లో నటించిన హీరోయిన్ దిశా పటానీ. విడిగా బయటకు వెళ్తే చాలామంది హీరోయిన్లను గుర్తుపట్టడమే కష్టం. కానీ ఆమెను మాత్రం ఓ అభిమాని గుర్తు పట్టడమే కాదు, దిశ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంట పడుతున్నాడని తాజా సమాచారం. ఆమె ఢిల్లీలో ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు.. వరుసగా రెండు రోజులు ఆమెను కలిసేందుకు హోటల్‌కు వెళ్లాడట. అయితే, హోటల్ వాళ్లు తనను రానివ్వకపోవడంతో యాజమాన్యంతో గొడవ కూడా వేసుకున్నాడు.
సినిమా సెట్‌లోను, షాపింగ్ మాల్‌లోను, సినిమా థియేటర్‌లోను.. ఇలా ఎక్కడకు వెళ్లినా వదలకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతానికి అతడి గొడవ వదిలిపోయిందని, అయితే అభిమానులు తనపై ఇంత ప్రేమ కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నానని దిశాపటానీ చెప్పింది. ఈ ప్రత్యేకమైన అభిమాని గురించి తెలిసి మాత్రం తాను షాకయ్యానని, ఇది చాలా చిత్రమైన అనుభవమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అయితే చేయలేదు గానీ.. రక్షణ కోసం ఓ బాడీగార్డును పెట్టుకోవాలని మాత్రం నిర్ణయించుకుందట.