పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై కొందరు డిస్ట్రిబ్యూటర్లు దాడిచేసిన సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
సి.కల్యాణ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల ‘లోఫర్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా నైజాం, సీడెడ్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ అనే డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టాలు రావడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురూ గత కొద్ది రోజుల నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని తనకేం సంబంధం లేదంటూ పూరీ బదులు చెప్పినా వీరు వినిపించుకోలేదు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -34లో ఉన్న పూరీ జగన్నాథ్ కార్యాలయానికి వచ్చిన అభిషేక్, సుధీర్, ముత్యాలరాందాస్ లు డబ్బులు ఇవ్వాలంటూ పూరీని బెదిరించారు. ఆ క్రమంలోనే పూరీపై దాడి కూడా చేసినట్లు తెలిసింది. దర్శకుడి కుటుంబ సభ్యులను సైతం నిందితులు భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దౌర్జన్యానికి పాల్పడ్డ ముగ్గురిని ఆపేందుకు పూరీ యత్నించినా ఫలితం లేకుండాపోయింది. కాగా, తన కార్యాలయంపై డిస్ట్రిబ్యూటర్లు దాడిచేశారంటూ పూరీ జగన్నాథ్ శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్‌విత్ 511 కింద కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.