
సుతిల్ బాంబులు పేలకపోతే.. ఆశ్చర్యపోతాం
కలర్ పెన్సిళ్లు పేలితే.. మరింత ఆశ్చర్యపోతాం
చిచ్చుబుడ్డి తుస్సుమంటే.. భూచక్రాలు తిరగకుంటే.. బాధపడతాం
అయితే మన సినీ ఇండస్ట్రీలో తయారైన బాంబుల్లో రీసౌండ్ వచ్చేలా ఎన్ని పేలాయో.. ఎన్ని తుస్సుమన్నాయో ఓ సారి చూద్దాం..
సుతిల్ బాంబులాంటి ‘అజ్ఞాతవాసి’
సుతిల్ బాంబులకు తిరుగులేదు. వాటిని పేల్చుతున్నామంటే.. చెవులు గిల్లుమనాల్సిందే. ఎప్పుడో కానీ అవి తుస్సుమనవు. అవి తుస్సుమంటే మనసు కూడా ఏదోలా అయిపోతుంది. అందుకే సుతిల్ బాంబులవి ప్రత్యేక స్థానం. టాలీవుడ్‌లో కూడా ఇలాంటివి కొన్నే ఉంటాయి. వాటిలో పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ప్రత్యేకమే. వీరి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అలానే ఉంటాయి. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫలితం చూస్తే ఏమైంది.. తుస్సుమంది. పేల్చిన మొదటి బాంబే తుస్సుమంటే.. అందులోనూ..సుతిల్ బాంబ్ అయ్యేసరికి టాలీవుడ్ నిరాశచెందింది.
లక్ష్మీబాంబ్‌ల్లాంటి సినిమాలు..
నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా, అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి, రవితేజ.. నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, సాయి ధరమ్ తేజ్.. ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, నితిన్ ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం లాంటివి బాగానే పేలుతాయని ఆశిస్తాం. కానీ పేలొచ్చు..పేలకపోవచ్చు. ఇలా ఈసారి లక్ష్మీ బాంబ్‌లు ఎక్కువగా పేలలేకపోయాయి. కొన్ని లక్ష్మీ బాంబ్‌లు తుస్సుమన్నాయి.
ఆర్డీఎక్స్‌లా పేలిన ‘ఆర్‌ఎక్స్ 100’
ఇక గంపగుత్తగా తెచ్చుకునే ఎర్ర బాంబులు, ఉల్లిగడ్డ బాంబులపై అంతగా పేలుతాయని ఆశించకపోయినా.. అందులో కొన్ని లక్ష్మీ బాంబ్‌లను తలపిస్తాయి. టాలీవుడ్‌లో చిన్న సినిమాలు కూడా అలాంటివే. ఏడాదికి వీటి సంఖ్య ఎంతో చెప్పడం కష్టమే అయినా.. రీసౌండ్ ఇచ్చి చెవులను మోతెక్కించినవెన్నో ఇట్టే చెప్పొచ్చు. ఇలా ఈ ఏడాదిలో మొదటగా చెప్పుకోవాల్సింది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం గురించే. బోల్డ్ కంటెంట్‌తో బౌండరీల మీద బౌండరీలు కొట్టేశాడు. ఆర్డీఎక్స్ పేలితే ఎంత విధ్వంసం సృష్టిస్తుందో.. బాక్సాఫీస్‌పై అంతగా విజృంభించేసింది.
గీత గోవిందం కూడా ఇదే కోవకు వస్తుంది. పెద్ద నిర్మాత ఉన్నా, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నా.. కూడా ఇది చిన్న సినిమాగానే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ దీని విజయం మాత్రం పెద్ద హీరోకి సైతం వీలుకాలేనంతగా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేసింది. వందకోట్లను కలెక్ట్ చేసేసి ‘గీత గోవిందం’ అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇవి రెండూ మరిచిపోలేని చిత్రాలే. కానీ ఈ రెండింటికి పొంతనే ఉండదు. సక్సెస్‌రేట్ దృష్ట్యా ఇవి రెండూ ప్రత్యేకమే.
భూ చక్రాలు, సుర్ సుర్‌బాణాల్లాంటివి..
ఇక సౌండ్ వచ్చే పటాకులే కాక కొన్ని వెరైటీ టపాసులను కూడా కొంటుంటాం. ఇవి పేలవు..కాని మనకు ఆనందాన్ని ఇస్తాయి. వాటిని చూస్తే మనకు ఆనందం వస్తుంది. భూచక్రాలు, రాకెట్‌లు, సుర్‌సుర్ బాణాల్లాంటివి ఇందులోకి వస్తాయి. సమ్మోహనం, నీదీ నాదీ ఒకే కథ, నన్ను దోచుకుందువటే, ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్, చిలసౌ, గూఢాచారి, కేర్ ఆఫ్ కంచెరపాలెం, యూ టర్న్ లాంటివి ఒకసారి చూడాలి అనుకుంటాం. అయితే వీటికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. కొన్నింటికీ డిమాండ్ ఉండదు. అంతగా అమ్ముడుపోవు. సమ్మోహనం, గూఢాచారి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసేశాయి. ఆగకుండా పేలి అందరి చేత శభాష్ అనిపించాయి.
కొత్త బాంబులు.. రీసౌండ్‌కే రీసౌండ్ ఇచ్చిన బాంబులు..
రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి, అరవింద సమేతలు ఇచ్చిన రీసౌండ్ ఇప్పటికీ మోగుతూనే ఉంది. అప్పటివరకు మూసధోరణిలో ఉన్న రామ్ చరణ్ బ్రూస్‌లీతో గుణపాఠం తెచ్చుకుని పంథా మార్చుకున్నాడు. లెక్కల మాష్టారు సుకుమార్‌తో కలిసి రంగస్థలం అనే బాంబును ప్రేక్షకుల మీదికి వదిలేశాడు. పేలడం మొదలుపెట్టింది..కానీ ఆగడం మాత్రం మరిచిపోయింది. ఇక మహేష్ బాబు-కొరటాల శివ గతంలో శ్రీమంతుడి లాంటి ఓ క్లాస్ పటాసును వదలగా.. ఈసారి భరత్ అనే నేను లాంటి మరో విభిన్నమైన టపాసును విసేరేశారు. అది పేలితే అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా పేలుతూనే పోయింది.
అలనాటి మహానటి సావిత్రి.. అంతటి నటి జీవితాన్ని వెండితెరపై ‘మహానటి’ని అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కొన్ని విమర్శలను మూటగట్టుకున్నా.. అందరినీ అప్పటి కాలానికి తీసుకెళ్లి సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ కసితో రగిలిపోయి తీశాడేమో అనేట్టుగా ‘అరవింద సమేత’లాంటి అదిరిపోయే సీమబాంబును తయారుచేశాడు. క్లాస్ లుక్స్‌తో, పంచ్ డైలాగ్‌లతో నడిపించే త్రివిక్రమ్.. తనశైలిని మార్చి మాస్‌కు కొత్త అర్థం చెప్పేశాడు. ఈ కొత్తబాంబులు టాలీవుడ్‌ను కళకళలాడేలా చేశాయి.
బాధను మిగిల్చినవి.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టివని
ఇక కొన్ని బాంబులు మనల్సి ఇట్టే ఆకర్షిస్తాయి. కానీ తీరా చూస్తే.. అవి పేలవు. ఇలాంటివాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ విసిరిన ‘నా పేరు సూర్య’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఛలో, తొలిప్రేమ, హలో గురు ప్రేమ కోసమే, శైలజా రెడ్డి అల్లుడు, దేవదాస్, నోటా లాంటి బాంబులు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు బాగానే పేలుతాయి. మరికొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతూ ఉంటాయి. వీటిలో ఛలో, తొలిప్రేమ లాంటి సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి.
పాము బిళ్లలు, కలర్ అగ్గిపుల్లలు, రీల్ పటాకుల్లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు చాలానే వస్తాయి. వీటి గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది. ఎందుకుంటే ఏడాదిలో అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయో లెక్కపెట్టడానికి కూడా వీలుండదు. ఏదేమైనా.. ఈ ఏడాది ఇప్పటివరకు టాలీవుడ్ తయారు చేసిన బాంబుల్లో బాగా పేలి ఆనందాన్ని ఇచ్చినవీ, అంచనాలు తప్పి తుస్సుమన్నవీ గుర్తుండిపోతాయి. వచ్చే దీపావళికి అణుబాంబుల్లాంటి సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రావాలని ఆశిద్దాం..
బండ కళ్యాణ్, ఇంటర్‌నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment