దీపావళి అంటే దీపాల వరుస. కరోనాతో షూటింగ్‌ల వరుస తప్పిన చిత్రపరిశ్రమ ఇప్పుడు వరుస సినిమాల సందడితో కళకళలాడుతోంది. దీపావళి వచ్చింది.. సందడి తెచ్చింది.. సినీప్రియులకు ఎన్నో తీపి వార్తలు అందించింది. పండగ ముందు రోజు.. పండగ నాడు వరుసగా బోలెడన్ని కబుర్లు అందించింది. ఈ దీపావళి... ‘సినిమావళి’.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఏషియన్ సినిమాస్‌పై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతూ, పల్లవి పెళ్లి బట్టల్లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.
గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. నవంబర్ 23 నుంచి ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తారు.
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ అని చిత్రబృందం తెలిపింది.
చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రామ్ తళ్లూరి నిర్మాత. ఈ సినిమాకు ‘కిన్నెరసాని’ అనే టైటిల్‌ను ప్రకటించారు.
సుశాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యస్. దర్షన్ దర్శకుడు.
‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇంద్రగంటితో మూడో సినిమా
సుధీర్ బాబు కమిట్ అయిన మరో సినిమాని కూడా ప్రకటించారు. సుధీర్‌తో ‘సమ్మోహనం, వి’ చిత్రాలు చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సీనియర్ నటి సీత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భద్రకాళి’. కేఎం ఆనంద్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో చిక్కవరపు రాంబాబు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఎ.మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది.
‘ఓదెల రైల్వే స్టేషన్’ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రాధ పాత్రలో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించనున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.
‘అభిమన్యుడు, హీరో’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు పీయస్ మిత్రన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు కార్తీ. ఈ సినిమా ప్రారంభం దీపావళి రోజు జరిగింది. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. మరోవైపు కార్తీ లేటెస్ట్ చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక.
సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నటన సూత్రధారి’. అమిత్ రంగనాథ్, సుశీల మాధవ పెద్ది జంటగా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ మోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇదో కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ అని చిత్రబృందం పేర్కొంది.
రాముడు లంకకు వెళ్లడానికి వంతెన నిర్మించాడు. ఆ గురుతులు ఇంకా ఉన్నాయి అనడానికి రామసేతు సాక్ష్యం అంటారు. ఇంతకీ నిజానిజాలు ఏంటి? అనే కథాంశంతో ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ‘రామ సేతు’ అనే చిత్రాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకుడు.
చలం రాసిన ‘మైదానం’ నవల సినిమాగా తెరకెక్కనుంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రం ఫేమ్ వేణు ఊడుగుల నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. కవి సిద్ధార్థ్ దీనికి దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ కోసం ఈ సినిమాను చేస్తున్నారు. ‘తెలుగు సినిమా సంతకాన్ని రీజెనొవేట్ (చైతన్యం) చేసే అవకాశం ఇస్తుంది కనుక ఈ ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నాం’ అన్నారు వేణు.
Comments
Please login to add a commentAdd a comment