దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌ | DJ Shabbir Stage Show With AR Rahman | Sakshi
Sakshi News home page

దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌

Published Sat, Dec 28 2019 8:24 AM | Last Updated on Sat, Dec 28 2019 8:24 AM

DJ Shabbir Stage Show With AR Rahman - Sakshi

బంజారాహిల్స్‌: తరచి చూస్తే సమాజాన్ని మించిన పాఠశాల లేదు.. పేదరికాన్ని మించిన గురువు లేడు. అనుక్షణం పరీక్షలు పెట్టేఈ సమాజంలో తట్టుకుని నిలబడ్డం ఆషామాషీ కాదు.. బతుకు పోరులో ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటే కొందరు తట్టుకోలేకఅక్కడే ఆగిపోతే.. మరికొందరు మాత్రం రాటుదేలి ఉన్నతంగా ఎదుగుతారు. ఈ రెండో కోవకు చెందినవాడే ‘డీజే షబ్బీర్‌’. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఇతడు కుటుంబానికిఆసరాగా ఉండేందుకు బడికి వెళ్లే వయసులోనే ఉపాధి బాట పట్టాడు. అక్షర జ్ఞానం లేకున్నా ఇప్పుడు సంగీత సామ్రాజ్యంలో డీజేగా వెలుగొందుతున్నాడు. అంతేనా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్‌ లవర్స్‌ ఇష్టపడేస్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి స్టేజీ షో ఇచ్చే స్థాయికి ఎదిగాడు.ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా సాగేవారికిపేదరికం, నిరక్షరాశ్యత అడ్డు రాలేవని
నిరూపించాడు షబ్బీర్‌.  

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10లోని జహీరానగర్‌ బస్తీకి చెందిన షబ్బీర్‌ది నిరుపేద కుటుంబం. ఉపాధి కోసం స్టేజ్‌ డెకరేషన్, లైటింగ్‌ బిగించడం వంటి పనులు నేర్చుకున్నాడు. ఇలా నగరంలో పలు వేడుకలకు స్టేజీలు, లైటింగ్‌ అలంకరణలు చేసేవాడు. షబ్బీర్‌ బిగించిన స్టేజీలపై జరిగే ‘డీజే’ల కళను టెంటు చాటున ఉండి గమనించేవాడు. గురువంటూ ఎవరూ లేకుండా తాను వెళ్లిన కార్యక్రమాల్లో డీజేలు స్వరాలను ఎలా సంగీతంగా అందిస్తున్నారో తెలుసుకున్నాడు. అలా తన 22 ఏళ్ల వయసులో మ్యూజిక్‌పై పట్టు సాధించిన ఇతడు ఇప్పుడు నగరంలోనే ప్రముఖ డీజేగా మారాడు. ప్రస్తుతం నగరంలో ఏ సినిమా వేడుక జరిగినా షబ్బీర్‌ డీజే తప్పనిసరిగా ఉండే స్థాయికి చేరుకున్నాడు. 

ఇప్పటికీ బస్తీయే నా బడి..
డీజే షబ్బీర్‌ అంటే తరచూ వేడుకలు జరుపుకునేవారికి.. అక్కడ ఎంజాయ్‌ చేసేవారికి తెలియనివారు ఉండరు. పైగా ఎప్పుడూ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండే ఇతడు తాను పుట్టిన జహీరానగర్‌ బస్తీని మాత్రం వదలడు. తనకు ఉపాధినిచ్చింది.. ఉనికి చాటింది.. నడక నేర్పించింది ఈ బస్తీయే అని ఇక్కడ ఉండటానికే తాను ఇష్టపడతానంటాడు. సంగీత విభావరులు, సినీ కార్యక్రమాలు ఏది జరిగినా తనకు ఆహ్వానం ఉంటుందని, అయితే పబ్బులు, క్లబ్బుల్లో జరిగే వేడుకల్లో మాత్రం తన డీజేతో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టం ఉండదంటున్నాడు షబ్బీర్‌. కేవలం ప్రేక్షకులు వచ్చే బహిరంగ కార్యక్రమాలు మాత్రమే తాను అంగీకరిస్తానంటున్నాడు. 

తెలుగు, హిందీ పాటల రీమిక్స్‌..
‘మియా భాయ్‌’ రీమిక్స్‌ పేరుతో తాను రూపొందించిన పాటలు మంచి ఆదరణ పొందాయని షబ్బీర్‌ తెలిపాడు. పాత పాటలు ‘రామయ్యా వస్తావయ్యా, మేరా జూటా హైజపానీ’ తదితర పాటల రీమిక్స్‌ విశేష ఆదరణ పొందాయన్నాడు. అలాగే ‘లెంబర్‌ గినీ’ పేరుతో మరో రీమిక్స్‌ కూడా చేసినట్టు వివరించాడు. డీజేలో తాను హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ పాటల్ని ప్లే చేస్తుంటానన్నారు. అవసరం కోసం సంగీతం కూడా నేర్చుకున్నానని, కొన్ని పాటలకు సొంతంగా స్వరాలు కడుతున్నట్టు వెల్లడించాడు. ‘హైదరాబాద్‌ నైస్‌ డీజే జాకీ’ పేరుతో తాను ముందుకు సాగుతున్నానని, ఒక  బస్తీ నుంచి ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉందన్నాడు.

‘‘రెండేళ్ల క్రితం ‘చెలియా’ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక పార్క్‌ హయత్‌లో నిర్వహించారు. ఆ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే. దాంతో వేడుకలో ఆయనా పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు నా డీజే ఏర్పాటు చేశాను. వేదికపై నా ప్రతిభను చూసి రెహమాన్‌ గారు ప్రత్యేకంగా అభినందించారు. డీజేలో కొన్ని సూచనలు కూడా చేశారు. ఆయనతోకలిసి స్టేజీ పంచుకునే అవకాశం రావడం ఒక వరం అనుకుంటే.. స్వర మాంత్రికుడే నన్ను మొచ్చుకోవడం అవార్డు తీసుకున్నంత ఆనందాన్నిచ్చింది.’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement