కుర్రాళ్లకు సన్నీలియోన్ పాఠాలు!
శృంగార తార సన్నీలియోన్ కుర్రాళ్లకు పాఠాలు చెబుతోంది. అయితే.. అవి ప్రేమపాఠాలు మాత్రం కాదు. సిగరెట్లు కాల్చొద్దని ప్రత్యేకంగా చెబుతోంది. ఇప్పటివరకు సిగరెట్లు కాల్చనివాళ్లయితే అసలు సరదా కోసం కూడా సిగరెట్లు ముట్టుకోవద్దని ఆమె అంటోంది. అది దీర్ఘకాలంలో మంచిది కాదని, దాంతో అంత సరదా కూడా ఏమీ ఉండదని తెలిపింది. పొరపాటున కాల్చాలని అనిపించినా, ఒకటికి రెండు సార్లు ముందు ఆలోచించాలని చెప్పింది. తను వెడ్స్ మనులో నటించిన దీపక్ డోబ్రియాల్‌తో కలిసి ప్రత్యేకంగా చేసిన యాంటీ స్మోకింగ్ ప్రకటన విడుదల సందర్భంగా సన్నీలియోన్ ఈ పాఠాలు వల్లించింది.
పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని, తన తండ్రి సిగరెట్లు తాగడం వల్ల కేన్సర్ వచ్చి మరణించారని ఆమె చెప్పింది. అందుకే అందరూ పొగతాగడం మానేసి.. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరింది. దురదృష్టవశాత్తు బలవంతంగా ఎవరిచేత సిగరెట్లు కాల్చడం ఆపించలేమని.. కేవలం తాము ఉన్నచోట కాల్చొద్దని మాత్రమే చెప్పగలమని అంటోంది. బహుశా ప్రభుత్వం, రెస్టారెంట్ల యజమానులు మాత్రం తమ భవనాలలో సిగరెట్లు కాల్చొద్దని చెప్పగలరేమోనంది.
11 నిమిషాలు అనే టైటిల్‌తో ఉన్న ఈ ప్రకటనకు హవాయిజాదా దర్శకుడు విభు పూరి దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటుడు అలోక్‌నాథ్ కూడా నటించారు. తాను చాలా అదృష్టవంతురాలినని, తనతో నటించేవాళ్లు ఎప్పుడు సిగరెట్లు కాల్చాలన్నా.. 'మేం సిగరెట్ కాలిస్తే నీకేమైనా ఇబ్బందా' అని అడుగుతారని.. కొంచెం దూరంగా వెళ్లి కాల్చుకుంటే మంచిదని తాను వాళ్లకు చెబుతానని సన్నీ తెలిపింది.