అరకు లోయలో ‘దృశ్యం’
అరకు లోయలో ‘దృశ్యం’
Published Mon, Apr 14 2014 11:01 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM
కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, సంక్రాంతి... ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దృశ్యం’, చేయబోతున్న ‘ఓ మైగాడ్’ సినిమాల్లో కూడా వెంకీ ఫ్యామిలీ మేన్‌గానే కనిపించబోతున్నారు. ఈ రెండూ విభిన్న కథాంశాలే కావడం విశేషం. ‘దృశ్యం’ షూటింగ్ ప్రస్తుతం అరకు లోయలో జరుగుతోంది. నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్‌లోనే వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరుపుతారు.
దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత డి.సురేశ్‌బాబు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఓ మధ్యతరగతి వ్యక్తి చేసిన సాహసమే ‘దృశ్యం’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేశ్ చేస్తుండటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. నాటి తరం కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నదియా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: వివేక్.
Advertisement
Advertisement