పాతుకుపోయిన వాళ్లతో చేయడం తలనొప్పి: రాంగోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా వార్తల్లోనే నిలుస్తాడు. ఆయన కొత్తగా తీసిన 'సత్య2' సినిమా కోసం దాదాపు అందరినీ కొత్త నటీనటులనే తీసుకున్నాడు. ఈ సినిమాలో పునీత్ సింగ్, అనైకా సోథీ, ఆరాధన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ''కొత్తవాళ్లతో పనిచేయడం హాయి. ఎందుకంటే, అది వాళ్ల మొదటి సినిమా అవుతుంది కాబట్టి వాళ్లు బాగా కష్టపడి పనిచేసి నూటికి నూరుశాతం పెర్ఫార్మెన్సు చూపిస్తారు. వాళ్లు సెట్ మీదకు వచ్చేసరికే మొత్తం సిద్ధమై వస్తారు. అదే అప్పటికే పాతుకుపోయినవాళ్లయితే... వాళ్లు బోలెడంత బ్యాగేజితో వస్తారు. ఏదైనా తమ ఇష్టం అన్నట్లుంటారు. వాళ్లు అప్పటికే ఇరుక్కున్న ఇమేజి చట్రం లోంచి బయటకు తీసుకొచ్చి, వాళ్ల క్యారెక్టర్లో ఇమిడిపోయేలా చేయడం చాలా కష్టం'' అని రాంగోపాల్ వర్మ ముంబైలో మీడియాతో వ్యాఖ్యానించారు.
ఇలాంటి అనుభవాలు గతంలో సీనియర్ నటులతో ఉన్నాయా అని అడగ్గా.. అలాంటిదేమీ పెద్దగా లేదని, అంతకుముందు నటించిన వారు ఎవరికైనా ఒక ఇమేజి ఉంటుందని, ఉన్నట్టుండి వాళ్లను ఒక రియల్ సన్నివేశంలో చేయమంటే వాళ్లకు అది చాలా కష్టం అయిపోతుందని, అందుకే తానలా చెప్పానని అన్నారు.