ఆ ఒత్తిడి వల్లే తగ్గా!
‘బొద్దుగా లడ్డూలా ఉన్నావ్.. ఏం తింటున్నావో ఏంటో.. తినడమే పనిగా పెట్టుకున్నావా ఏంటి?’ అని పరిణీతి చోప్రాను మొహం మీదే అడిగినవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ రేంజ్‌లో ఉండేవారామె. తొలి చిత్రం ‘ఇషక్‌జాదె’లో కూడా బొద్దుగానే కనిపించారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాల్లో కూడా పాత తరం నాయికలా నిండైన బుగ్గలతో పుష్టిగా ఉండేవారు. దాంతో విమర్శలపాలయ్యారు. ఇక లాభం లేదనుకుని, పరిణీతి తగ్గారు. ఇప్పుడీ స్లిమ్ బ్యూటీకి ప్రశంసలే ప్రశంసలు. అవునూ.. అసలెందుకు తగ్గాలనిపించింది? అనే ప్రశ్న పరిణీతి ముందుంచితే - ‘‘హీరోయిన్ కాకపోయి ఉంటే ఎప్పటికీ తగ్గేదాన్ని కాదేమో.
‘లావుగా ఉన్నావ్.. సన్నబడకపోతే సినిమాలు రావు’ అని అందరూ ఒత్తిడి చేయడంవల్ల తగ్గాను. నేనిప్పుడింత స్లిమ్‌గా ఉన్నానంటే ఆ ఘనత హిందీ పరిశ్రమకే దక్కుతుంది’’ అని చెప్పారు. తగ్గాక చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటున్నారని పరిణీతి చెబుతూ - ‘‘ఈ మధ్య షాపింగ్ మాల్స్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో నేను కనిపిస్తే చాలు అమ్మాయిలు చుట్టుముట్టేస్తున్నారు. ముఖ్యంగా లావుగా ఉన్న అమ్మాయిలు ‘భలే తగ్గారే. మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మేమూ తగ్గుతాం’ అంటుంటే వినడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు.