ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే! | Exclusive Interview with Director Krishna Vamsi | Sakshi
Sakshi News home page

ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే!

Published Mon, Feb 10 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే!

ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే!

కృష్ణవంశీ సినిమాలే కాదు. ఆయన మాటలు కూడా ఎడ్యుకేట్ చేసేలా ఉంటాయి. ప్రేక్షకుల  అంతరంగాలే ఆయనకు కథావస్తువులు. ప్రేమ, నక్సలిజం, ఫ్యాక్షనిజం, టైజం, కుటుంబం,  ఫాంటసీ, దేశభక్తి... కాదేదీ కృష్ణవంశీ కథాంశానికి అనర్హం. ఫార్ములాకి అతీతంగా వెళ్లి జనాన్ని మెప్పించగలిగే స్టామినా కృష్ణవంశీ సొంతం. ‘పైసా’ సినిమా విషయంలో ఆయన చేసింది అదే. భూమిపై పుట్టిన ప్రతి వాడి బలహీనత ‘పైసా’. దాన్ని ఆసరాగా తీసుకొని ఓ సినిమా తీసేశారు. వెండితెర అనే అద్దంపై సగటు ప్రేక్షకునికి ప్రతిరూపంగా తన హీరోని నిలబెట్టి విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఆ ఆనందంలోనే సోమవారం హైదరాబాద్‌లో  పాత్రికేయులతో ముచ్చటించారు కృష్ణవంశీ. 
 
 ‘పైసా’ కథ ఆలోచన ఎలా వచ్చింది మీకు?
 ప్రస్తుతం సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఓ ఫార్ములాని నమ్ముకొని సినిమాలు తీసేస్తున్నారు. ఒకరిద్దరు దర్శకులు తప్ప అందరి పరిస్థితి ఇదే. అలా కాకుండా ఏదైనా కొత్తగా వెళ్లాలనిపించింది. ఆ ఆలోచనకు రూపమే ‘పైసా’. ఈ సినిమా చిత్రీకరణ విషయంలోనూ కొత్తగానే ఆలోచించాను. స్క్రీన్‌ప్లే అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. కథ డిమాండ్ మేరకు సన్నివేశాలను పుట్టించడం. ప్రస్తుత చిత్రాల్లో రన్ అవుతోంది ఈ పద్ధతే. రెండో పద్ధతి... ప్రేక్షకుల స్పందనను ముందే ఊహించి సన్నివేశాలను తీర్చిదిద్దడం. ‘పైసా’ విషయంలో నేను అవలంబించింది అదే. ఈ కథలో హీరోకి కోటి రూపాయలు చాలు. కానీ... తనకి తెలీకుండానే... తన పక్క యాభై కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా... కాసేపటికైనా ఆ విషయం హీరోకు తెలుస్తుంది. కానీ ఎలా తెలుస్తుంది? ప్రేక్షకుడికి విపరీతమైన క్యూరియాసిటీ పెంచే అంశం ఇది. సాధారణంగా నేను థియేటర్లలో సినిమా చూడను. కానీ, ఈ సినిమా చూశా. ఆ సన్నివేశాల్లో ఒకటే విజిల్స్, కేకలు. అంటే... వాళ్లు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కోటి రూపాయల కోసం చూసేవాడికి యాభై కోట్లు దొరికితే వాడి మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఆ డబ్బుని నొక్కేస్తాడా? లేక ప్రభుత్వపరం చేస్తాడా? ఈ నేపథ్యంలో హీరో పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే డబ్బు ఎన్నిచోట్ల ఎన్ని విధాలుగా పరావర్తనం చెందుతుందో ఇందులో చూపించాం. రాజకీయం, వ్యభిచారం, దుబాయ్ షేక్‌ల పెళ్లిళ్ల వ్యవహారం, దొంగనోట్లు, హవాలా...  ఇలా అన్నింటినీ టచ్ చేశాం. అయితే క్రియాశీల రాజకీయాల జోలికి పోలేదు. తొలిరోజు టాక్ డివైడ్‌గా ఉంటుందని తెలుసు. ఎందుకంటే నా తొలి సినిమా ‘గులాబి’ నుంచి జరుగుతోంది అదే. అదే ఈ సినిమాక్కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం అందరూ ఆదరిస్తున్నారు. 
 
 సీనియర్ దర్శకునిగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పేమైనా గమనించారా?
 టీజర్స్ చూసి.. ఒక కథను మైండ్‌లో డిజైన్ చేసేసుకొని థియేటర్‌కి వస్తున్నారు. వారి ఊహలకు దగ్గరగా ఉంటే ‘హిట్’ అనేస్తున్నారు. ఊహలకు భిన్నంగా ఉంటే ఫట్టుమనిపిస్తున్నారు. ప్రస్తుతం చాలా సినిమాలు అందుకే దెబ్బతింటున్నాయి. ప్రేక్షకుల్లో ‘హీరో వర్షిప్’ ఎక్కువైపోయింది. ఇది నిజంగా బాధా కరమైన విషయమే. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే... అనాదిగా ఇక్కడి ప్రజలు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. రాజులు పరిపాలిస్తున్న కాలంలో వాళ్లను దైవాంశ సంభూతులుగా చూసి కొలిచారు. తర్వాత తురుష్కులు ఏలుతున్న కాలంలో వాళ్లను నవాబులుగా కొనియాడారు. బ్రిటిషర్లు పరిపాలించిన కాలంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నడుస్తోంది ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకున్నా... జరుగుతోంది రాచరికమే. వ్యక్తిపూజ జనానికి అలవాటైపోయింది. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. అందుకు  సినీరంగం మినహాయింపేం కాదు. పోస్టర్ చూసి ఇది మా హీరో సినిమా, మా కులపోడి సినిమా అనే మైండ్‌సెట్‌తో సినిమాలకు వెళుతున్నారు. అలాంటి ప్రేక్షకులుంటే మంచి సినిమాలు ఎలా వస్తాయి. అన్ని రకాలుగా సమాజం విషపూరితం అయిపోయింది. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. 
 
 మీ మాటల్లో సామాజిక స్పృహ బాగా వినిపిస్తుంది. మరి మీ సినిమాల్లో అది ఏ మేరకు కనిపిస్తుందంటారు? 
 సినిమా అనేది నా జీవితం, నా ఉద్యోగం. జీవితాన్ని, ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకుంటాం. సినిమా కూడా నాకంతే. ప్రజల బలహీనతల్ని ఆసరాగా తీసుకొని బాధ్యతారహితంగా నేను సినిమాలు తీయలేదు. తీయను కూడా. నా సినిమాల ద్వారా ఎంతో కొంత మంచి చెప్పడానికే ప్రయత్నిస్తా. 
 
 మీ హీరోల్లో కాస్త నెగిటివ్ షేడ్స్ కనిపిస్తుంటాయి?
 ఈ రోజున తెలుగు సినిమా హీరో అంటే... క్రిమినల్, దొంగ, పోరంబోకు, పోకిరి, ఎందుకూ పనికిరానివాడు. శేఖర్‌కమ్ముల, క్రిష్ లాంటి దర్శకుల చిత్రాల్లోనే హీరో అనేవాడు కాస్త బాధ్యతాయుతమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఇదే పరిస్థితి. తెరపై వందల మందిని ఊచకోత కోస్తాడు. వాడిపై ఒక్క కేసు కూడా ఉండదు. కానీ నా హీరో అలా ఉండడు. మిగిలిన సినిమాల్లో హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమబుద్ధుడే. వాడిలో ఏదో ఒక కొత్తకోణం ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఓ నెగిటివ్ యాంగిల్ ఉన్నట్లు నా హీరోలో కూడా కనిపిస్తుంది. అంతేతప్ప ఆ యాంగిల్లోనే మొత్తం కనిపించడు. నా దృష్టిలో హీరో అనేవాడికి ఒక అంతఃసంఘర్షణ ఉండాలి. తను చేసే ప్రతి పనికీ ఓ పర్పస్ ఉండాలి. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లో హీరోలు అలాగే ఉంటారు. వాళ్లనే నేనూ ఫాలో అవుతా.
 
 ‘పైసా’ తర్వాత మళ్లీ ఫామ్‌లోకొచ్చానని అనుకుంటున్నారా?
 నేను ఫామ్‌లో లేకుండా ఎప్పుడూ లేను. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనే వాటిని నమ్మను. సినిమా ఫెయిల్ అయితే... నా వర్క్ ఫెయిల్ అయ్యిందని భావిస్తాను కానీ... నేను ఫెయిల్ అయినట్లు ఫీలవ్వను. ఎందుకంటే... సినిమా అనేది నా ఒక్కడి కృషి కాదు. సమష్టి కృషి. సినిమా జయాపజయాలపై అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. 
 
 ప్రేమకథల్ని వదిలిపెట్టేశారే?
 ప్రేమపట్ల నాకున్న దృక్కోణం వేరు. నేటి సినిమాల్లో చూపిస్తున్న ప్రేమను నమ్మను. ఫాల్స్ ఎమోషన్లనే ప్రేమగా చూపించేస్తున్నారు. నేనలా తీయలేను. అందుకే ప్రేమకథలకు కామా పెట్టా. అయితే, త్వరలో నానుంచి ఓ మంచి ప్రేమకథ వస్తుంది. హిందీలో వచ్చిన ‘లవ్ ఆజ్‌కల్’ నాకు ఇష్టమైన ప్రేమకథ. 
 
 రామ్‌చరణ్‌తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది?
 పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా గొప్ప సినిమా అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ముందే కనిపిస్తున్నాయి. ఇందులో రామ్‌చరణ్ తాతగా తమిళ నటుడు రాజ్‌కిరణ్ నటిస్తున్నాడు. బాబాయ్‌గా శ్రీకాంత్ చేస్తున్నాడు. ఇక తండ్రి పాత్రకు ఓ అగ్ర హీరో ‘ఓకే’ అయ్యే అవకాశాలున్నాయి. 
 
 మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’ ఎప్పుడు తీస్తారు?
 చనిపోయేలోపు తప్పకుండా తీస్తా. ఎందుకంటే... నేటి సమాజానికి ఆ సినిమా అవసరం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement