ఒకేసారి కోటి రూపాయలు దొరికితే..!?
ఒకేసారి కోటి రూపాయలు దొరికితే..!?
Published Wed, Feb 5 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
‘‘దేవుని 11వ అవతారం ‘పైసా’ అని చెప్పే సినిమా ఇది. ప్రస్తుతం పైసా చుట్టే భూమి తిరుగుతోంది. డబ్బు వల్ల సంబంధాలు తెగుతాయి. అలాగే బలపడతాయి. మనుషుల మానసిక స్థితిగతుల్ని శాసించేది డబ్బు మాత్రమే. ‘పైసా’లో ఈ విషయాలన్నింటినీ చర్చించాం’’ అని కృష్ణవంశీ చెప్పారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పుప్పాల రమేష్ నిర్మించిన చిత్రం ‘పైసా’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘పాతబస్తీలోని ఓ బట్టలషాపులో షేర్వానీ మోడల్‌గా ఇందులో నాని కనిస్తాడు.
ఇందులో తన పేరు ‘ప్రక్యాష్’. పేరులోనే క్యాష్ ఉందన్నమాట. డబ్బుని అమితంగా ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తికి ఒకేసారి కోటి రూపాయలు దొరికితే.. అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎంతవరకు నీతిగా ఉంటాడు? అనేది సింపుల్‌గా నాని కేరక్టరైజేషన్. విడుదల తేదీని ముందు పెట్టుకుని ఇన్నాళ్లూ షూటింగులు చేశాను. కానీ... ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నా కెరీర్‌లో ఇదో అనుభవం’’ అని తెలిపారు.
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు కృష్ణవంశీతో పనిచేయడం గొప్ప అనుభూతి. ఇందులో నేను కొత్తగా ఉంటాను. పాటలు విడుదలైన 5 నెలలకు విడుదలై ‘ఈగ’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా అంతకంటే ఎక్కువ డిలే అయ్యింది కాబట్టి ‘ఈగ’ కంటే పెద్ద హిట్ కావాలి’’ అని నాని ఆకాంక్షించారు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైందని నిర్మాత చెప్పారు. కేథరిన్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్కే, తబర్ కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement