పైసా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది - కృష్ణవంశీ
పైసా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది - కృష్ణవంశీ
Published Mon, Feb 10 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
‘‘చాలాకాలం తర్వాత థియేటర్‌కెళ్లి సినిమా చూశాను. ప్రతి సన్నివేశానికీ జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. చూసిన చాలామంది ‘మీకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందంటున్నారు’’ అని కృష్ణవంశీ అన్నారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘పైసా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా విషయంలో దర్శకునిగా పూర్తి సంతృప్తితో ఉన్నాను. రెగ్యులర్ ఫార్మెట్‌లో వెళ్లకుండా కొత్తగా ట్రై చేసి తీసిన సినిమా ఇది. మెల్లమెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ, స్పీడ్‌గా ఆదరిస్తున్నారు. డెఫినెట్‌గా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు.
‘‘ఇంటర్వెల్ ముందు చార్మినార్ నేపథ్యంలో నానిపై తీసిన సన్నివేశానికి మంచి స్పందన వస్తోంది. మూడే టేకుల్లో ఆ సీన్ తీశాను. అలాగే డబ్బు దొరికిన సన్నివేశంలో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. రాజారవీంద్ర కేరక్టర్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం, హైదరాబాదీ ఆర్టిస్టులు ఆర్కే, తబర్, లోబోల నటన ఈ చిత్రానికి హైలైట్స్’’ అని కృష్ణవంశీ చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘మురారి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీసే పనిలో ఉన్నానని, ఆ సినిమా తర్వాత తాను, నాని కలిసి ఓ సమకాలీన చిత్రం తీస్తామని, దాంట్లో నానినే హీరో అని కృష్ణవంశీ తెలిపారు. విడుదలలో జాప్యం జరిగినా ‘పైసా’కు మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, ఇందులోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని నాని ఆనందం వ్యక్తం చేశారు.
త్వరలో విజయయాత్ర కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు స్పందన చూస్తుంటే... చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. కృష్ణవంశీ టేకింగ్, నాని యాక్టింగ్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి’’ అని తెలిపారు. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న ‘సరదా’ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని, అలాగే మంచు మనోజ్ హీరోగా తాను నిర్మించనున్న ‘సన్నాఫ్ పెదరాయుడు’ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌కెళుతుందని, ఓ అగ్రహీరోతో హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని రమేష్ పుప్పాల చెప్పారు. ఇంకా రాజారవీంద్ర, ఆర్కే, తబర్, సాయికార్తీక్ కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement