మళ్లీ సింగిల్! | Exclusive Interview with Prabhu Deva | Sakshi
Sakshi News home page

మళ్లీ సింగిల్!

Published Fri, Jun 5 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

మళ్లీ సింగిల్!

మళ్లీ సింగిల్!

 ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్
 
ఏంటండీ.. పానీ పూరీలు, పావ్ బాజీలు మీ ఒంటికి బాగా పడ్డట్లున్నాయి...?
 అఫ్‌కోర్స్ అవన్నీ తింటాననుకోండి. ముఖ్యంగా రోడ్ సైడ్ తినడం ఇష్టం. మొదట్నుంచీ నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఓ ప్రత్యేకమైన మమకారం ఉంది. అప్పుడప్పుడూ ఏదైనా చాట్ బండార్ దగ్గరకెళ్లి లాగించేస్తా. అయినా, పానీ పూరీలు, పావ్ బాజీలు ఒంటికి పడ్డాయని ఎందుకంటున్నారు?
 
 కొంచెం మెరుపుగా, ఫిట్‌గా ఉన్నారు కాబట్టి ఉత్తరాది ఫుడ్ బాగానే ఒంటబట్టిందని ఫీలింగ్?
 (నవ్వుతూ) ఇలా ఫిట్‌గా ఉండాలి కదా. లేకపోతే స్క్రీన్‌కి పనికి వచ్చే అవకాశం ఉండదు. అందుకే, కొంచెం మెయిన్‌టైన్ చేస్తా.
 
 ముంబయ్‌కే పరిమితమయ్యారు.. మీ చెన్నయ్ సాంబారు గుర్తుందా?
 సాంబార్‌ని మర్చిపోవడం అంత సులువు కాదు. ఈ టైమ్‌లో సాంబార్‌ను గుర్తు చేసేశారు. చెన్నయ్‌లో వేడి వేడి ఇడ్లీలు, సాంబార్ లాగించిన రోజులు గుర్తొస్తున్నాయ్. నాలుక కూడా సాంబార్ తినమంటోంది (నవ్వుతూ).
 
 ఓకే.. త్వరలో విడుదల కానున్న మీ ‘ఏబీసీడీ 2’ చిత్రం విషయానికొద్దాం.. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటి?
 నా పాత్ర బాగుంటుంది. వరుణ్ ధవన్, శ్రద్ధాకపూర్ జంట చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇద్దరూ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరూ ఓ హైలైట్ అయితే డాన్సులు మరో హైలైట్. ‘ఏబీసీడీ’లో డాన్సులు ఎంత బాగుంటాయో తెలిసిందే. ఈ సీక్వెల్‌లో ఇంకా బాగుంటాయి. తొలి భాగానికన్నా ఈ చిత్రంలో ఉన్న ఎమోషన్ ఇంకా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లానే ఈ సెకండ్‌పార్ట్ కూడా త్రీడీ మూవీ. అందుకని ఇది కూడా థ్రిల్‌గా ఉంటుంది.
 
 మంచి డాన్సర్ కావాలని కలలు కనే ఓ యువకుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం చేశారట?
 ఒక వ్యక్తికి సంబంధించిన కథ కాదిది. ముంబయ్‌కి చెందిన ఫిక్టీషియస్ అనే డాన్స్ అకాడమీకి సంబంధించిన కథ. ప్రపంచ స్థాయిలో చాంపియన్‌షిప్ సాధించడానికి వాళ్లేం చేశారు? అనేది కథ.
 
 ఒకప్పుడు మంచి డాన్స్ మాస్టర్ అనిపించుకోవడానికి చాలా కృషి చేశారు కదా.. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ రోజులు గుర్తొచ్చాయా?
 ఈ సినిమా చేస్తున్నప్పుడే కాదు.. నా పాత రోజులు నాకు రోజూ గుర్తుంటాయి. వాటిని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. నేనీ స్థాయికి రావడానికి కారణంగా నిలిచిన ప్రతి మెట్టూ నాకు గుర్తే.
 
 ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో స్పెషల్ రోల్ చేయించాలనుకున్నారట?
 అవునా? నాకా విషయం గురించి తెలియదు. ఈ చిత్రదర్శకుడు రెమో అనుకున్నారేమో. అయితే దాని గురించి నాకేం చెప్పలేదు.
 
 ఇంతకీ అల్లు అర్జున్ నటించారా?
 ఈ సినిమాకి సంబంధించినంతవరకూ నేను ఓ మంచి పాత్ర చేశాను. అల్లు అర్జున్ చేసినట్లు నాకు తెలియదు (నవ్వుతూ).

 ఎవరైనాసరే మంచి పేరు కోసం, డబ్బు సంపాదించడం కోసం కృషి చేస్తారు. చిన్న వయసులోనే మీరు ఈ రెంటినీ సాధించారు కదా.. ఇంకా ఏమైనా లక్ష్యాలున్నాయా?
 పేరూ, డబ్బూ సంపాదించాను... కాదనడంలేదు. కానీ, వృత్తిపరంగా ఇంకా కొత్తవాణ్ణే. నృత్యదర్శకునిగా, నటుడిగా, దర్శకుడిగా నేనే సినిమా చేసినా అది కొత్త సినిమాలానే భావిస్తాను. వృత్తిపరంగా నాకు ఆకలి ఎక్కువ. ఏం సాధించినా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది.
 
 దర్శకుడు మీకు ‘ఏబీసీడీ’లు వచ్చని నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చినదే తెలుగు పరిశ్రమ. మరి.. తెలుగు చిత్రాలెందుకు చేయడంలేదు?
 యాక్చువల్‌గా నేను హైదరాబాద్ వస్తే, చాలామంది నన్నీ ప్రశ్న అడుగుతుంటారు. నాకేం చెప్పాలో తెలియడంలేదు. ఎందుకంటే నేనేదీ ప్లాన్ చేసుకోను. హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక అక్కడ వరుసగా అవకాశాలు వచ్చాయి. అవన్నీ కూడా మంచి సినిమాలు కావడంతో ఒప్పుకున్నాను. అంతే తప్ప హిందీ సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యి, చేయడం లేదు.
 
 తెలుగు నిర్మాతలెవరూ మిమ్మల్ని సినిమాలు చేయమని అడగడంలేదా?
 అడుగుతున్నారండి. నాకూ చేయాలనే ఉంది. నాతో సినిమా చేస్తే వాళ్లకూ సౌకర్యవంతంగా ఉండాలి. సేమ్ టైమ్ నాకూ అలానే ఉండాలి. అలా కంఫర్ట్ లెవల్స్ కుదరాలంటే టైమ్ సెట్ అవ్వాలి.
 
 తమిళంలో ఓ చిత్రంలో హీరోగా నటించనున్నారట?
 ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇంకా ఫైనలైజ్ కాలేదు. మరో నెలలోపు తెలిసిపోతుంది.
 
 ముందు నృత్యదర్శకునిగా, ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత దర్శకునిగా.. ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చారు.. ఈ ప్రయాణం గురించి?
 చాలా ఆసక్తికరమైన ప్రయాణం. ఎప్పటికప్పుడు పరీక్షలే. నృత్యదర్శకునిగా వచ్చినప్పుడు ఓ పెద్ద పరీక్ష. ఆ సవాల్‌ని జయించామని తృప్తి పడ్డాక హీరోగా వచ్చా. అదో పెద్ద బాధ్యత. మొత్తం మీద అక్కడా మార్కులు కొట్టేశా. ఆ తర్వాత దర్శకునిగా. ఇది ఎంత పెద్ద బాధ్యతో చెప్పక్కర్లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా.. భేష్ అనిపించుకున్నా. ఓవరాల్ జర్నీ ఫుల్ హ్యాపీ.
 
 కొంచెం పర్సనల్ మ్యాటర్స్ విషయానికొద్దాం.. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారా?
 భలే సూటిగా అడిగారండి. సింగిల్‌గానే ఉన్నాను.
 
 సింగిల్‌గా ఉన్నప్పుడు, రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు.. ఏది బాగుంటుంది?
 (నవ్వుతూ) దేని ఆనందం దానిదే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సింగిల్ స్టేటస్, రిలేషన్‌షిప్ స్టేటస్ ఉంటాయి. రెండూ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
 
 కొరియోగ్రాఫర్స్‌లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది మీకేనేమో?
 మీరు చెబితేనే ఈ ఫాలోయింగ్ గురించి తెలుస్తోంది. మంచిదే కదా.
 
 ఈ మధ్య ఏమైనా తెలుగు సినిమాలు చూశారా?
 కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గోవిందుడు అందరివాడు’ చూశాను. నచ్చింది.
 
 ‘బాహుబలి’ ట్రైలర్ చూశారా?
 అతిశయోక్తి కాదు కానీ, ట్రైలర్ చూడకముందే బ్రహ్మాండంగా ఉంటుందనుకున్నా. చూసిన తర్వాత నా ఊహ నిజమనిపించింది. ఇండియన్ సినిమా మరో లెవల్‌కి వెళ్లిందనిపించింది.
 
 మీరలాంటి సినిమాలు చేయాలనుకుంటారా?

 అలాంటివి చేయాలంటే చాలా నాలెడ్డ్ కావాలి. నాకంత లేదు. .
 
 అవునూ.. రీసెంట్‌గా మీకు యాక్సిడెంట్ అయ్యిందని విన్నాం..
 అయ్య బాబోయ్.. నేను బాగానే ఉన్నాను కదండీ. టాప్ టూ బాటమ్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినట్లు అనిపిస్తోందా? ఓహో.. ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయమన్నమాట.
 
 ‘ఏబీసీడీ 2’ తర్వాత మీ నుంచి రాబోతున్న చిత్రం?
  ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ చేస్తున్నా. అక్టోబర్ 2న విడుదలవుతుంది.
 
 మళ్లీ ఆ సినిమా ప్రమోషన్ అప్పుడే హైదరాబద్ వస్తారన్నమాట?
 షూటింగ్స్‌కి వచ్చి వెళుతుంటాను. ప్రమోషన్ అప్పుడు తెలుగు మీడియాని కలుస్తుంటాను. మీరడిగారని చెప్పడం కాదు కానీ, హైదరాబాద్ నా సొంత ఊరులానే అనిపిస్తుంది.
 
 ఫైనల్‌గా.. దర్శకునిగా మీకెలాంటి చిత్రాలు చేయాలని ఉంది?
 అందరికీ సంతోషాన్నిచ్చే చిత్రాలు చేయాలన్నదే నా ధ్యేయం.
 - డి.జి. భవాని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement