ధనుష్‌ హాలీవుడ్‌ మూవీ తమిళ్‌లో! | The Extraordinary Journey of the Fakir Tamil Version Titled Pakkiri | Sakshi
Sakshi News home page

ధనుష్‌ హాలీవుడ్‌ మూవీ తమిళ్‌లో!

Published Wed, Jun 5 2019 10:00 AM | Last Updated on Wed, Jun 5 2019 10:00 AM

The Extraordinary Journey of the Fakir Tamil Version Titled Pakkiri - Sakshi

కోలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన అతికొద్ది మంది కోలీవుడ్‌ నటుల్లో ధనుష్‌ ఒకరు. ఈయన నటించిన హాలీవుడ్‌ చిత్రం ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్‌ పకిరి.  కెన్‌స్కాట్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పకీర్‌ అనే యువకుడి ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఇతివృత్తంగా తెరకెక్కింది. తన తండ్రిని వెతుక్కుంటూ ముంబై నుంచి ప్యారిస్‌ దేశానికి వెళ్లే పకీర్‌ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం పకిరి.

ధనుష్‌ కథానాయకుడిగా ఈ సినిమాలో స్ట్రీట్‌ మెజీషియన్‌గా నటించారు. ఈ చిత్రం పలు ఇతర భాషల్లోనూ అనువాదం అయ్యి విడుదలైంది. తమిళంలో పకిరి అనే టైటిల్‌తో ఈ నెల 21న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ను యూనిట్‌ వర్గాలు విడుదల చేశారు. కాగా ఆంగ్లం, ఫ్రెంచ్‌ భాషల్లో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.

అంతేకాదు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శింపబడింది. కాగా తమిళ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక్కడ ధనుష్‌ నటించిన చిత్రం విడుదలై చాలా కాలమైంది. మారి–2 చిత్రం తరువాత ఆయన చిత్రమేదీ తెరపైకి రాలేదు. ఆ పకిరి చిత్రం ఆ లోటును భర్తీ చేస్తుందన్నమాట. ప్రస్తుతం ధనుష్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో అసురన్‌ చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో ఆయన మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీని తరువాత సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ధనుష్‌ వరుసగా రెండు చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో ఒక చిత్రానికి దురై సెంథిల్‌కుమార్, మరో చిత్రానికి రామ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దురై సెంథిల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రామ్‌కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటిస్తున్న చిత్రం 2020లో తెరపైకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement