
మాస్ అమ్మా.. మాస్.. మనం ఊర మాస్. గళ్ల లుంగీ, కట్ బనియన్, డిజైన్ చొక్కా, గళ్ల తువ్వాలు... పక్కా విలేజ్ మాస్ కుర్రాడు ఎలా ఉండాలో చిట్టిబాబు అలానే ఉన్నాడు. ఇతగాడికి పట్టరాని ఆనందం వస్తే జజ్జనకరి జనారే అంటూ చిందేయాల్సిందే. చూశారుగా.. చిట్టిబాబు ఎంత తన్మయత్వంతో ఒళ్లు మైమరచి చిందేస్తున్నాడో? ఇక్కడ కనిపిస్తున్నది రామ్‌చరణ్ కదా.. చిట్టిబాబు అంటున్నారేంటి అనుకుంటున్నారా? చిట్టిబాబంటే రామ్‌చరణే. ‘రంగస్థలం’లో చరణ్ పేరు చిట్టిబాబు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రామ్‌చరణ్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తనదైన స్టైల్లో సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఐదు రోజుల టాకీ, రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరిలో షూట్ చేయనున్న రెండు సాంగ్స్‌లో ఒకటి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ‘శ్రీమంతుడు, జనతాగ్యారేజ్’ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన మా బ్యానర్‌లో ‘రంగస్థలం’ హ్యాట్రిక్ మూవీగా నిలుస్తు్తంది’’ అన్నారు నిర్మాతలు.