ఫెంటాస్టిక్.. ఫాంటమ్ | fantastic movie phantam | Sakshi
Sakshi News home page

ఫెంటాస్టిక్.. ఫాంటమ్

Published Wed, Sep 2 2015 11:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఫెంటాస్టిక్.. ఫాంటమ్ - Sakshi

ఫెంటాస్టిక్.. ఫాంటమ్

భజ్‌రంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్‌ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మరో మెరిక లాంటి చిత్రం ఫాంటమ్. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం భారత్‌ను ఎలా ఇబ్బంది పెడుతుందోన్నదని చిత్ర కథ. భారత్ కూడా పాక్ బాటలో నడిచి వారి దేశంలోకి గూఢచారులను పంపడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? అన్న వైవిధ్యమైన కోణంలో కథ ముందుకు సాగుతుంది. ఇంతవరకూ ఇటువంటి పాయింట్‌తో భారత సెల్యులాయిడ్‌పై చిత్రం రాలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే కనిపించినా డైలాగులు మాత్రం తేలిపోయాయి.

 కథేంటి?
 26/11 ముంబై దాడి సూత్రధారులను శిక్షించాలని కోరుతూ భారత్ చేసే ప్రయత్నాలు సఫలం కావు. దీంతో నిందితులకు శిక్ష పడాలంటే ‘ముల్లుకు ముల్లు’ సిద్ధాంతమే సరైనదని భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) నిర్ణయిస్తుంది. దీనికి ఉన్నతాధికారులు అంగీకరించరు. దీంతో రహస్యంగా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయిస్తారు. ఈ పనికోసం సైన్యం నుంచి తీసివేసిన దనియల్ ఖాన్‌ను (సైఫ్ అలీఖాన్) సంప్రదిస్తారు. అతన్ని లండన్‌కు పంపి ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల శిక్షకుడు, లష్కరే తోయిబాకు సహకరించిన సాజిద్‌ను మట్టుబెడతారు. ఇందుకు అమెరికాకు చెందిన ఆయుధాల సరఫరా కంపెనీ ఏజెంట్, ఫార్శీ (ఇరాన్) అయిన నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్) సాయం తీసుకుంటారు.

తర్వాత దనియల్ ఖాన్ అమెరికా వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవలో ఇరుక్కుని జైల్లో పడతాడు. ముంబై దాడులకు ముందు ఇండియాలో రెక్కీ నిర్వహించిన డేవిడ్ హెడ్లీ అదే జైలులో ఉంటాడు. ‘రా’ ఆదేశాలతో జైలులోనే ఎవరికీ అనుమానం రాకుండా అతన్ని హతమారుస్తాడు. తర్వాత నవాజ్ (కత్రినా) సాయంతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని పాకిస్తాన్ చేరుకుంటాడు. అక్కడ రా ఏజెంట్ల సాయంతో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను, హిజబుల్ ముజాహిదీన్ అధినేత సయీద్ సలావుద్దీన్‌లను తెలివిగా చంపేస్తాడు. ఈ ప్రయత్నంలో వారికి సహకరించిన వారందరూ చనిపోతారు. చివరకు దనియాల్, నవాజ్ ఇద్దరే కరాచీ తీరానికి చేరుకుంటారు. సరిగ్గా 26/11 దాడులకు తీవ్రవాదులు ఎలాగైతే భారత్‌కు వచ్చారో, అలాగే దేశం చేరుకోవాలనుకుంటారు. కానీ, ఆ ప్రయత్నంలో దనియాల్ ప్రాణాలు కోల్పోతాడు. నవాజ్ మాత్రమే భారత్ చేరుకుంటుంది.
 

సాంకేతిక వర్గం పనితీరు..
 సినిమాకు సాంకేతిక వర్గం తమ అద్భుతమైన పనితీరుతో ప్రాణం పోశారు. ముఖ్యంగా సిరియా ఎన్‌కౌంటర్, పాకిస్తాన్ సెట్టింగ్‌లు వేయడం మామూలు విషయం కాదు. హాలీవుడ్ స్థాయి పోరాటాలు, సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉన్నాయి. చక్కని నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్‌లు సినిమాను సాంకేతికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగింది. అన్నీ వెరసి హైదరాబాదీ, దర్శకుడు కబీర్ ఖాన్‌కు బాలీవుడ్‌లో వరుసగా రెండో హిట్ తెచ్చిపెట్టాయి.
 
 తేలిపోయిన మాటలు..
 సినిమాలో సంభాషణలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీనికి తోడు సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో హఫీజ్ మాట్లాడే మాటలు, కత్రినా పాకిస్తాన్‌లో తన బాల్యాన్ని వివరించే తీరు, రా అధికారుల సంభాషణలు సన్నివేశం బరువుకు తగ్గట్టుగా లేవు.

 ప్రధాన తారాగణం: సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్, జునే స్మిత్ తదితరులు.
 సంగీతం: ప్రీతం
 కెమెరా: అసీమ్ మిశ్రా
 కథ: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్
 స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కబీర్ ఖాన్
 నిర్మాత: సాజిద్ నదియాద్‌వాలా
 డిస్ట్రిబ్యూటర్: యూటీవీ మోషన్ పిక్చర్స్
 
 సందేశం: తీవ్రవాదం ఎక్కడ, ఎలాంటి రూపంలో ఉన్నా సహించకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement