ఫాంటసీ కథా చిత్రంలో విశాల్
ఫాంటసీ కథా చిత్రంలో నటుడు విశాల్ నటించనున్నారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే విధంగా ఈ చిత్రం ఒక కొత్త కలయికకు బీజం వేయనుంది. చిత్రం పేసుదడి, అంజాదే, ఓనాయుమ్ ఆటుకుట్టి, పిచాశు తదితర వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మిష్కిన్, కమర్శియల్ చిత్రాల కథానాయకుడు విశాల్‌ల రేర్ కాంబినేషన్‌లో ఈ ఫాంటసీ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం మరుదు చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి లింగుసామి దర్శకత్వంలో సండైకోళి-2 చిత్రంలో నటించాల్సి ఉంది.
అయితే అనూహ్యంగా లింగుసామి విశాల్‌కు హ్యాండ్ ఇచ్చి టాలీవుడ్ యువ నటుడు అల్లుఅర్జున్ హీరోగా ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవడంతో విశాల్ వెంటనే మిష్కిన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇది దర్శకుడు మిష్కిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా విశాల్ ఇప్పటి వరకూ నటించనటువంటి కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోంది. మేలో చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.