సృజనకు గుర్తింపు : ముఖేష్‌భట్
ముంబై : దర్శకులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సినిమాల ప్రదర్శనలతో పాటు చలనచిత్రోత్సవాలు కూడా దోహదపడతాయని ప్రముఖ దర్శకుడు , టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖే ష్ భట్ తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయం నానాటికీ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (ఎంఎఫ్‌ఎఫ్) సందర్భంగా శుక్రవారం జరి గిన ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న చిత్రాల అంతర్జాతీయ బయ్యర్లను ఆకర్షించేందుకు ఇటువంటి చిత్రోత్సవాలు ఎంతో ఉపకరిస్తాయని ఆయన అన్నారు.
ఇటువంటి ఉత్సవాల వల్ల యువ దర్శకులు తమ ప్రతిభను, చిత్రాలను ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నీలో ఉన్న సృజనాత్మకతను తగి న విధంగా ప్రదర్శించగలిగితే, నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయాన్ని తట్టుకోగలిగే అవకాశముంటుంది. ఇటువంటి ఉత్సవాలు ప్రపంచం మన నుంచి ఆశిస్తున్న ప్రతి భను ప్రదర్శించేందుకు ఎంతో ఉపకరిస్తాయ’ని ఆయన అన్నారు. చిత్రోత్సవ నిర్వాహకుల్లో ఒకరైన స్పానిష్ ప్రతినిధి బృందాన్ని ఆయన కొనియాడారు.
స్పెయిన్ వంటి దేశాల్లో నేను చాలా సార్లు పర్యటించాను. మన సంస్కృతీ సంప్రదాయాలకు స్పెయిన్‌తో దగ్గర సంబంధాలుంటాయి. స్పెయిన్ చాలా సుందరమైన దేశం. ఒక దర్శక నిర్మాతగా అక్కడ కనీసం 20 సినిమాలైనా తీయాలనుంది’ అని ముక్తాయించారు. స్పెయిన్‌లో సినిమా షూటింగ్‌లు, ఫైనాన్స్‌కు సంబంధించి బాధ్యత వహించే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఆడియో విజువల్ ఆర్ట్స్(ఐసీఏఏ) డెరైక్టర్ జనరల్ సుజా నాడిలా సియెరాతో కలిసి బాలీవుడ్ నటి నందితాదాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.