అవునా.. నిజమేనా?
అదృష్టం కళ్లముందు కదలాడుతుంటే, దురదృష్టం నెత్తిపై తాండవించిన పరిస్థితిని కొందరు ఎదుర్కొన్నారనే కథానాలు తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి వాళ్లు అనుకున్నదొక్కటి. అయ్యింది ఒక్కటి అని మనసులోని చింతను బయటకు కక్కలేక, మింగలేక సతమతం అవుతున్నారు. దీనికంతటికీ కారణం బాహుబలి–2 చిత్రమే. బాహుబలి ఒక సంచలనం అయితే బాహుబలి–2 ఒక చరిత్రగా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూళ్లను కొల్లగొట్టి కనుచూపు మేరలో మరే చిత్రం ఆ దరిదాపులకు చేరుకోలేనంత కంచుకోటగా మారింది.
మరికొన్ని బ్రహ్మాండ చిత్రాలకు సవాల్ విసిరి ఆయా చిత్ర యూనిట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రపంచస్థాయి చిత్రం బాహుబలి–2. దీనికి సూత్రధారి రాజమౌళి అయితే, పాత్రధారులుగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా ప్రతి తార, సాంకేతిక నిపుణుడు నిలిచారు. బాహుబలి–2లో ప్రతి అంశం ఒక కళాఖండమే అనడం అస్సలు అతిశయోక్తి కాదు. అందుకే బాహుబలి–2 చిత్రాన్ని ప్రపంచ సినిమానే భళిరా అంటోంది. అలాంటి చిత్రంలో నటించే అవకాశాలు తమకు రాలేదే అని కొందరు బాధ పడుతుంటే. వచ్చిన అవకాశాన్ని అంగీకరించలేకపోయామే అని మరి కొందరు మథన పడుతున్నారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ కథేంటో చూద్దాం. బాహుబలి చిత్రంలో మొదట బాహుబలిగా నటించే అవకాశం బాలీవుడ్ నటుడు రుతిక్‌రోషన్‌నే వరించిందట. దర్శకుడు రాజమౌళి ఆయన్నే సంప్రదించారట. అయితే ఆయనకు కాల్‌షీట్స్ సమస్య తలెత్తడంతో బాహుబలిలో నటించలేనని అనాసక్తతను వ్యక్తం చేశారట. దీంతో నటుడు ప్రభాస్‌ను ఆ అవకాశం వరించింది. ఆయన మార్కెట్‌ను అమాంతం జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇక భల్లాళదేవ పాత్రకు తొలుత మరో బాలీవుడ్ నటుడు జాన్‌అబ్రహంను నటింపజేసే ప్రయత్నాలు చేయగా ఆయన నిరాకరించారట. అలా ఆ పాత్ర నటుడు రానాను వెతుక్కుంటూ వచ్చింది.
కథానాయకి దేవసేన పాత్ర నటి నయనతార ఇంటి తలుపుతట్టగా ఆమె కూడా కాల్‌షీట్స్ సమస్యతో అంగీకరించలేని పరిస్థితి అనీ, అదే విధంగా చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచిన శివగామి పాత్ర అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి ముంగిట వాలగా ఆమె రూ.ఐదు కోట్లు పారితోషికం కావాలంటూ డిమాండ్ చేయగా అందుకు సగం పారితోషికానికే నటి రమ్యకృష్ణను ఎంపిక చేసి రాజమౌళి ఆ పాత్రకు ఆమెను చిరునామాగా మార్చారు. ఇక అవంతిక పాత్రకు ముందుగా తమన్నా లిస్ట్‌లో లేరట. ఆ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ సోనంకపూర్‌ను ఎంపిక చేయాలని ప్రయత్నించినా, ఆమె నిరాకరించడంతో తమన్నా పంట పండిందట. కాగా అప్పుడు కాదు, వద్దు, పెద్ద మొత్తంలో పారితోషికం కోరిన వారందరూ ఇప్పుడు అబ్బ భలే చాన్స్ మిస్ అయ్యామే అని చింతిస్తున్నారట. అవునా? ఇదంతా నిజమేనా? అంటే అక్షరాలా వాస్తవం అంటున్నారు సినీవర్గాలు.