
వాళ్లంతా ప్రచారం చేస్తున్నారు..
దసరా పండుగ వెళ్లీ వెళ్లగానే మనకి గుర్తొచ్చేది దీపావళే. దీపావళి అనగానే టపాసులే. ఈ టపాసులు కాల్చడం వల్ల జరిగే నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించండంటూ.. సిల్వర్ స్క్రీన్ స్టార్లు ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరికి వారు తమ స్టైల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో టపాసుల మోత తగ్గించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అనుష్క శర్మ, త్రిష, శ్రియా, ఛార్మి, రకుల్, దేవీశ్రీ ప్రసాద్ తదితరులు ఆసక్తికర ఫొటోలతో అవగాహన కల్పిస్తున్నారు. తెర మీద నటనతోనే కాదు.. సామాజిక బాధ్యత విషయంలో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
కాగా సంచలనాత్మక రీతిలో పాలుతాగే పసిపిల్లలు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. 'ఇంకా అభివృద్ధి చెందని మా ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు.. టపాకులు ద్వారా జనించే శబ్ధ, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతగా అల్లాడిపోతాయో ఆలోచించండి' అంటూ ఆరు నెలల వయసున్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారీ, 14 నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీపావళి పండుగనాడు టపాకులు పేల్చే కార్యక్రమాన్ని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని, అందుకు కనీసం 5 గంటలైనా వేడుక జరుపుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. టపాకుల పేల్చివేత వ్యవధిని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్ధారిస్తే సరిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చింది. తరుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తెలిపే వివరాలను బట్టి అదే రోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.