మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు! | film writer satyanand Special Interview | Sakshi
Sakshi News home page

మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు!

Published Sat, Nov 22 2014 11:40 PM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM

మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు! - Sakshi

మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు!

సినీ రచయితగా సత్యానంద్‌ది ఓ శకం. ఆయన కలం నుంచి జాలువారిన సిరాక్షరాలు... నిర్మాతలకు సిరులు కురిపించాయంటే అతిశయోక్తి కాదు. కెరీర్ ప్రారంభించి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా... ఇంకా ఆయన కలం జెట్ వేగంతో రచిస్తూనే ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు తన రచనలతో అద్భుత విజయాలు అందించిన సత్యానంద్.. ప్రస్తుతం యువ దర్శకుల చిత్రాలతో బిజీగా ఉన్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్?
 పుట్టిన రోజు చేసుకునే అలవాటు నాకు మొదట్నుంచీ లేదు. దానికి పెద్ద ప్రాముఖ్యతను కూడా ఇవ్వను. అందుకే... నా పుట్టిన రోజు తేదీ చాలామందికి తెలీదు కూడా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్.
 
 ‘రచన- సత్యానంద్’... ఈ కార్డ్ తెరపై కనిపిస్తే చాలు ‘సినిమా హిట్’ అని నిర్ధారించుకునేవారు ప్రేక్షకులు. ఆ వైభవం గుర్తొస్తే ఏమనిపిస్తుంది?
 సంతోషంగా ఉంటుంది. రచయితగా నాకంటూ ఓ గౌరవ స్థానాన్నిచ్చిన తెలుగు సినిమాకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు రాయడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నేను ఇంత ధాటిగా సినిమాలు రాశానంటే దానికి నా తొలి సినిమా విజయమే కారణం. ‘మాయదారి మల్లిగాడు’ నా తొలి చిత్రం. నా మేనమామగారైన ఆ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చెప్పిన చిన్న ఐడియా ఆధారంగా కథ తయారు చేసి ఆయనకు వినిపించాను. ఆ కథ నచ్చి.. ఆ చిత్రానికి మాటలు రాసే అవకాశాన్ని కూడా నాకే ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత భారీ అఫర్లు వాటంతట అవే నా తలుపు తట్టాయి. 80ల్లో అయితే... ఊపిరి సలపకుండా పనిచేశాను. ఆ వయసు అలాంటిది. అవకాశాలొస్తుంటే... అన్నింటినీ నిలబెట్టుకోవాలనే కసి. ఒక సినిమా సెట్‌లో ఉంటే, రెండు సినిమాలు డిస్కషన్స్‌లో ఉండేవి. కె.రాఘవేంద్రరావుతోనే 45 సినిమాలకు పనిచేశాను. కోదండరామిరెడ్డితో 20 సినిమాలు చేశాను. కెరీర్ మొత్తం మీద 400 సినిమాలకు పై మాటే.
 
 ఇలా జనరేషన్‌తో నిమిత్తం లేకుండా.. అప్ డేట్ అవ్వడం మీకే సాధ్యమైంది.
 రచయితకు పరిశీలనాత్మక దృష్టి అవసరం. కథలు, మాటలు ఎక్కడ్నుంచో పుట్టవు. సమాజం నుంచే పుడతాయి. ఈ విషయం తెలిసిన వాణ్ణి కాబట్టే ఇలా ఉండగలుగుతున్నా. దర్శకుల మనోభావాలకు తగ్గట్టుగా నా రచనలు ఉంటాయి. ఇప్పుడు యంగ్‌స్టర్స్‌తో వర్క్ చేస్తున్నా. వాళ్ల ఆలోచనల్ని గమనిస్తున్నా. పుస్తకాలు చదువుతా. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది.
 
 మీ కెరీర్‌లో ఛాలెంజ్‌గా తీసుకొని రాసిన సినిమా?
 శివాజీగణేశన్ నటించిన తమిళ చిత్రం ‘తంగపతకం’ని తెలుగులో చేయాలి అనుకున్నప్పుడు.. ఆ ఐడియాను మాత్రమే తీసుకొని, మాతృకకు పూర్తి భిన్నంగా ‘కొండవీటి సింహం’ కథ తయారు చేశాం. ఎన్టీఆర్‌కున్న నంబర్‌వన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఆ కథ నాకు మంచి పేరు తెచ్చింది. అలాగే..    ‘జస్టిస్‌చౌదరి’. ‘జడ్జి అంటే మాస్ అప్పీల్ ఏముంటుంది?’ అని స్వయంగా ఎన్టీఆర్‌గారే అన్నారు. దాంతో ఛాలెంజ్‌గా తీసుకొని మాస్‌ని మెస్మరైజ్ చేసేలా కథను తయారు చేశాం. ‘అద్భుతంగా చేశారు బ్రదర్’ అని ఎన్టీఆర్‌గారు అభినందించిన ఆ క్షణాలు నా కెరీర్‌లో మరచిపోలేనివి.
 
 చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపిస్తారు. ఇంత మాస్ సినిమాలు ఎలా చేశారు?
 మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు (నవ్వుతూ).బయటకు నేనెలా కనిపించినా... నా లోపల ఉంది మాసే.
 
 చిరంజీవి నటించిన ఎక్కువ హిట్ సినిమాలకు రచయిత మీరే కదా?
 అదేంలేదు. అందరి హీరోలకూ రాశాను. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన మొగుడు కావాలి, న్యాయం కావాలి, కోతలరాయుడు చిత్రాలకు రచన చేసింది నేనే. ఆయన స్టార్ అయ్యాక... యముడికి మొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, దొంగమొగుడు... ఇలా చాలా సినిమాలకు రాశాను.
 
 కళాత్మక చిత్రాలకు ఎక్కువగా రాయలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా?
 లేదు.. నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ పెట్టారు కానీ, సీరియస్ టాక్స్ పెట్టలేదు కదా! సినిమా బావుండటం ముఖ్యం. మాయదారి మల్లిగాడు, న్యాయం కావాలి, పెళ్లిసందడి లాంటి సినిమాలకు రాసినందుకు గర్వపడతా.
 
 అప్పట్లో జంధ్యాల, మీరూ పోటాపోటీగా రాసేవారు కదా?
 మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి పది సినిమాలకు పనిచేశాం. వాటిలో నా కథకు ఆయన డైలాగులు రాస్తే, ఆయన కథకు నేను డైలాగులు రాశాను. నా సినిమాల గురించి ఆయనతో డిస్కస్ చేసేవాణ్ణి. ఆయన కూడా తన సినిమా గురించి నాతో డిస్కస్ చేసేవారు. చాలా ఆరోగ్యకరంగా ఉండేది మా బంధం. పారితోషికాలు కూడా దాదాపు సరిసమానంగా తీసుకునేవాళ్లం. మా ముందు తరం రైటర్లకు పదివేలు దాకా ఇచ్చేవారట. మేమిద్దరం 75 వేలు తీసుకునేవాళ్లం.
 
 రచయితగా మీకు ప్రేరణ?
 ఆత్రేయగారి డైలాగులంటే ఇష్టం. ముళ్లపూడి వెంకటర మణ, భమిడిపాటి రాధాకృష్ణమూర్తి హ్యూమర్ అంటే ఇష్టం. వీళ్ల రచనలు చూసి ‘ఇలా రాస్తే బావుండు’ అనుకుంటాను కానీ, వారిలా రాయడానికి ప్రయత్నించను.
 
 మీ తర్వాత జనరేషన్లో మీకు నచ్చిన రచయిత?
 త్రివిక్రమ్. ప్రస్తుతం తనే నంబర్‌వన్. రాబోయే జనరేషన్‌పై కూడా అతని ప్రభావం ఉంటుంది. తను బాగా చదువుకున్న వ్యక్తి. గొప్పగా రాస్తాడు.
 
 ప్రస్తుతం పంచ్ డైలాగుల ట్రెండ్ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
 స్పాంటేనియస్‌గా చప్పట్లు కొట్టించడానికి పంచ్ డైలాగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేతప్ప కథతో దానికి సంబంధం ఉండదు. దీనివల్ల ఆడియన్స్ నుంచి త్వరగా రియాక్షన్ వస్తుంది. అందుకే పంచ్‌డైలాగులను ఆశ్రయిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో పంచ్ డైలాగైనా, మంచి డైలాగ్ అయినా సన్నివేశానికి తగ్గట్టే ఉండాలి. సందర్భంగా వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు బావుంటుంది కానీ, రాన్రానూ జనానికి విసుగు వస్తుంది.
 
 సినిమా మొదలయ్యేది పేపర్ వర్క్‌తో. అంతటి ప్రాధాన్యమున్న రైటర్‌కి ఇండస్ట్రీలో గౌరవం లేదనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? పారితోషికాల్లోనూ రైటర్స్‌కి అన్యాయం జరుగుతోందంటున్నారు. మీరేమంటారు?
 పరిశ్రమలో ఎవరికి తగ్గ గౌరవం వారికి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ టాలెంట్ ఎంత కౌంట్ చేస్తుందో, బిహేవియర్ కూడా అంత కౌంట్ చేస్తుంది. నా వరకు అయితే.... అలాంటి చేదు అనుభవాలు లేవు. ఇక రెమ్యునరేషన్లు అంటారా... మనం సక్సెస్‌ఫుల్‌గా పని చేస్తున్నప్పుడు డబ్బులు కూడా ఆటోమేటిగ్గా మనల్ని ఫాలో అవుతాయి. సక్సెస్‌ఫుల్‌గా చేయనప్పుడు సమస్యలొస్తాయి. సమస్యలు సృష్టించేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు.
 
 అందుకే ఆ సినిమా ఆడలేదు
 నేను ఓ సినిమాను డెరైక్ట్ చేశానని చాలామందికి తెలీదు. ‘ఝాన్సీరాణి’ మంచి సినిమా. మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తీశాను. ఆ సినిమాకు ముందే రాజేంద్రప్రసాద్ ‘లేడీస్‌టైలర్’ విడుదలైంది. తను కామెడీ స్టార్ అయిపోయాడు. తనతో సినిమా అనగానే... కామెడీనే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, ‘ఝాన్సీరాణి’లో అతనిది నెగిటివ్ పాత్ర. దాంతో జనానికి సహించలేదు. సినిమాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొందరు నిర్మాతలు నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ, నాకే కుదర్లేదు.
 
 - బుర్రా నరసింహ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement