
‘ఆది’ ఎవరు? అంటే మన తెలుగు ప్రేక్షకులు చిన్న ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఇప్పుడు మలయాళ ‘ఆది’ రెడీ అవుతున్నాడు. ఆదిగా కనిపించనున్న ఈ మలయాళ హీరో ఎవరో కాదు.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ప్రణవ్‌కి హీరోగా ‘ఆది’ మొదటి సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే ఈ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ రిలీజ్ చేశారు. ప్రణవ్ హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని పోస్టర్ చూసినవారు అంటున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న నమ్మకం ఉంది. ప్రణవ్ అద్భుతంగా నటిస్తున్నాడు’’ అని పేర్కొన్నారు జోసెఫ్. ఆల్రెడీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకెళుతున్నాడు. మలయాళంలో పేరు తెచ్చుకుని, ‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ భాషల్లోనూ మార్కులు కొట్టేశారు. ఇప్పుడు మోహన్‌లాల్ వారసుడు ప్రణవ్ వస్తున్నాడు. ఈ వారసుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, తండ్రిలా తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తాడని ఊహించవచ్చు.