కల్యాణీ ప్రియదర్శన్
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్‌లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది.
‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్‌లో నాన్నగారు సెట్‌లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది.
లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి
Comments
Please login to add a commentAdd a comment