అందుకే వెనుకంజ
కుటుంబానికే తొలి ప్రాధాన్యం: రవీనా టండన్
న్యూఢిల్లీ: రవీనా టండన్ పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించింది. కెరీర్ కంటే ఇల్లు, పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎప్పుడో ఓసారి సినిమాలవైపు చూస్తోంది. వయసులో ఆమెకంటే పెద్దవారైనప్పటికీ మిగతా నటీమణులు వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ రవీనా మాత్రం వారితో సమానంగా సాగలేక పోతోంది. ఎందుకు? ఇదే విషయాన్ని ఆమెవద్ద ప్రస్తావించినప్పుడు.... ‘సినిమాల్లో నటించడానికి నాకు తొందరేం లేదు. అనిల్ థదానీని పెళ్లి చేసుకున్నాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. పిల్లలు పుట్టాక కెరీర్ వెనక్కు వెళ్లిపోయింది. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. మరో ఇద్దరిని దత్తత తీసుకున్నాం. భర్త, ఇల్లు, పిల్లలు.. ఈ జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది. నా ఇష్టంతోనే కెరీర్‌ను పక్కనపెట్టాను. ఇంటికి, పిల్లలకు దూరం చేసే కెరీర్ నాకొద్దు అనిపించింది. అయినా సినిమాల్లో నటించడానికి తొందరేం లేదు. నా కుటుంబంతో గడపడానికి తగినంత సమయం లభించే ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తున్నాను. అందుకే మిగతావారితో పోలిస్తే పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించాన’ని చెప్పింది.
డిస్ట్రిబ్యూటర్ థదానీని పెళ్లి చేసుకున్నాక పెహచాన్: ద ఫేస్ ఆఫ్ ట్రూత్, శాండ్‌విచ్, బుడ్డా హోగా తేరే బాప్, శోభనా 7 నైట్స్ వంటి కొన్ని సినిమాల్లో మాత్రమే రవీనా కనిపించింది. అయితే ఇవేవీ కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. అందుకు కారణం ఈ సినిమాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండి, వాణిజ్య విలువలు లేకపోవడమేనన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. శోభనా 7 నైట్స్ సినిమా కమర్షియల్‌గా నిర్మాతను ఇబ్బంది పెట్టినా పలు చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొని దర్శకుడికి మంచిపేరు తెచ్చింది. అయితే పెళ్లికి ముందు రవీనా సక్సెస్‌ఫుల్ నటిగా నిరూపించుకుంది. అందాజ్ అప్నా అప్నా, చోటేమియా బడే మియా, ఘర్‌వాలీ-బాహర్‌వాలీ, ఆంటీ నంబర్ 1, బాంబే వెల్వెట్ వంటి చిత్రాలు రవీనాకు మంచి పేరే తెచ్చాయి. తెలుగులో ఆమె నటించిన బంగారు బుల్లోడు మంచి వసూళ్లనే రాబట్టింది.