స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది | friendship strengthen our ralation, says SV krishnareddy and achhireddy | Sakshi
Sakshi News home page

స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది

Published Sun, Aug 2 2015 8:32 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది - Sakshi

స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది

ప్రేమకు, అనుబంధాలకు పరిధులు ఉంటాయి. కానీ స్నేహానికి ఇవేం ఉండవు. ఇద్దరి మధ్య పరిచయం.. స్నేహం చిగురించడానికి కారణాలు అనేకం. అయితే ఆ స్నేహం కొనసాగాలంటే స్నేహమే కావాలి. అలాంటి ఇద్దరు స్నేహితుల రెండు మనసులు కూడా ఒకలా ఆలోచిస్తాయి. ఎంతలా అంటే ఇద్దరు మిత్రుల 43 ఏళ్ల స్నేహమంత. వారే ప్రముఖ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వీరిని ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించగా ఇలా స్పందించారు.
 
‘వెస్ట్ గోదావరి జిల్లా, ఆరవల్లి సూల్లో చదువుకున్నాం. అప్పట్నుంచి మా జర్నీ సాగుతోంది. మా స్నేహంలో ప్రతి సందర్భం మెమొరబుల్‌గానే ఉంటుందని’ అచ్చిరెడ్డి అంటే, ఇన్నాళ్లుగా స్నేహం కొనసాగడానికి ఇద్దరిలో ఎవరెక్కువ కారణమంటే.. అచ్చిరెడ్డిగారే అని జవాబిచ్చారు కృష్ణారెడ్డి. ఇలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టమని సంబరపడిపోయారు.
 
స్నేహం వల్లే ప్రొఫెషన్..
అచ్చిరెడ్డి: ప్రొఫెషన్‌ను అభిరుచులను తెలుసుకుని ఎంచుకున్నాం. నాకు సినిమా రంగం పట్ల ఆసక్తి మాత్రమే ఉండేది. కృష్ణారెడ్డికి సినిమా పట్ల ప్రత్యేకమైన క్లారిటీ, అవగాహన ఉండేది. అది గమనించి మేం సినిమా రంగంలోకి వస్తే బాగా రాణించగలం అనిపించింది.  
 
నాకన్నా గొప్ప వ్యక్తి..
కృష్ణారెడ్డి: సినిమాలంటే నాకు బాగా ఆసక్తి. నాలో నాకు తెలియని టాలెంట్‌ని గుర్తించి అచ్చిరెడ్డి నాకు సపోర్ట్‌గా నిలిచాడు. నేను ఫాంటసీలో ఉంటాను, ఆవేశం కూడా. కొన్నిసార్లు నేను తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అన్నింట్లో కరెక్ట్ చేస్తూ అచ్చిరెడ్డి నన్ను ముందుకు తీసుకువెళ్తాడు. అందుకే ఆయన నాకన్నా గొప్ప వ్యక్తి.
 
మా స్నేహంలో స్వార్థం లేదు..

అచ్చిరెడ్డి: మా స్నేహంలో స్వార్థం లేదు. నువ్వు గొప్పా, నేను గొప్పా, అనే అహాలకు స్థానం లేదు. అదే ఉంటే మా స్నేహం ఇన్నేళ్లు నిలిచేది కాదు.
కృష్ణారెడ్డి: చిన్న చిన్న విషయాల్లో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. ఇద్దరం కలిసి మాట్లాడుకుని మంచి నిర్ణయం తీసుకుంటాం. అచ్చిరెడ్డి నాకన్నా మంచి వ్యక్తి. అభిప్రాయాలే వేరు.. భేదాలు రావు.
 
అతనే మంచి మిత్రుడు..
అచ్చిరెడ్డి: నా వరకు కృష్టారెడ్డే మంచి మిత్రుడు. ఇది అనుభవంతో చెబుతున్నది. మనసులో ఆనందాన్ని ఇద్దరం పంచుకుంటాం. ఈ స్నేహం భగవంతుడిచ్చిన వరం.
కృష్ణారెడ్డి: అనుక్షణం నా కోసం, నా కష్టాన్ని, ఇష్టాన్ని తీరుస్తూ ఉండే స్నేహితుడు మాత్రం అచ్చిరెడ్డే. నా కష్టాల్లో కూడా తోడుండే ఆప్తుడు ఆయన.
 
స్నేహం కొనసాగాలంటే..
అచ్చిరెడ్డి: ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించాలి. అభిప్రాయాలు కలవనప్పుడు వాటిని స్నేహంతో కలుపుకుపోవాలే కానీ కలతలు తెచ్చి పెట్టుకోకూడదు. అభిప్రాయాల మధ్య తేడా వచ్చినా స్నేహ బంధంతో కలవక తప్పదు.
కృష్ణారెడ్డి: కలిసి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పోరాడడం సైనికుల లక్షణం. అదే విధంగా స్నేహంలో రాజు ఎవరు, సైనికుడు ఎవరనేది వేరే విషయం. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి ఇద్దరూ కట్టుబడి పనిచెయ్యాలి. స్నేహాన్ని, స్నేహితుడిని గౌరవించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement