ఆయనే లేకపోతే నా కల నెరవేరేది కాదు
చెన్నై: భర్త ప్రోత్సాహం లేకపోతే తన కల నెరవేరేది కాదని కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ భార్య, 'మలై నేరత్తు మాయక్కం' చిత్ర దర్శకురాలు గీతాంజలి తెలిపింది. భర్త ప్రేరణ, మద్దతుతోనే తను మెగాఫోన్ పట్టానని ఆమె మురిసిపోతోంది. సెల్వ రాఘవన్ లేకపోతే తన చిరకాల కోరిక నెరవేరేది కాదని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది.
దర్శకురాలు కావాలని చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్నానని, అయితే పెళ్లి, పాపకు జన్మనివ్వడంతో కొంతకాలం దానికి వాయిదా వేసినట్లు గీతాంజలి పేర్కొంది. అయితే పెళ్లయినంత మాత్రాన, అభిరుచులను పక్కనపెట్టాల్సిన అవసరం లేదని భర్త ఎపుడూ చెబుతూ ఉండేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టానన్నారు.
మరోవైపు భర్త తనకు ఘోస్ట్ డైరెక్టర్గా పనిచేశాడన్న వార్తలను గీతాంజలి కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎంత కష్టపడ్డానో తనకు మాత్రమే తెలుసని, ఘోస్ట్ డైరెక్టర్ పేరుతో తానుపడ్డ శ్రమ అంతా వృధా కావడం, క్రెడిట్ అంతా భర్తకు పోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఈ సినిమాకు తన భర్త స్ర్కిప్ట్ అందించడం గొప్ప విషయమని, సెల్వ రాఘవన్తో పెళ్లికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని వెల్లడించింది.
కాగా 7/జి బృందావన కాలనీ సినిమా స్టోరీ నేపథ్యాన్నే తీసుకొని సరికొత్త కథను సిద్ధం చేశాడు రాఘవన్. 'మలై నేరత్తు మైకం' టైటిల్తో ఈ సినిమాకు గీతాంజలి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. హీరోగా కోలా బాలకృష్ణ, హీరోయిన్గా వామిఖ కూడా వెండితెరపై మెరవబోతున్నారు. అమ్రిత్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పలువురిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ వామిఖ నటన అనుకున్నత స్థాయిలో లేకపోవడంతో... ఆమెపై షూటింగ్ స్పాట్లో సెల్వ రాఘవన్ చేయి చేసుకున్నాడనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.