
నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ!
మహేశ్‌బాబు ఓకే అనాలే కానీ... రోజుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేసినా చాలనన్ని సినిమా అవకాశాలు ఆయన ముంగిట్లో ఉంటాయి.
మహేశ్‌బాబు ఓకే అనాలే కానీ... రోజుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేసినా చాలనన్ని సినిమా అవకాశాలు ఆయన ముంగిట్లో ఉంటాయి.
ఆయనకు నిర్మాతల తాకిడి ఆ స్థాయిలో ఉంది. కానీ ఆయనే... ఆచితూచి అడుగులేస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రయోగాల
జోలికి పోకుండా...
ఓ పక్క నటునిగా తనను తాను నిరూపించుకుంటూ, మరో వైపు వాణిజ్యపరంగా కూడా విజయాన్ని అందుకునే
కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు మహేశ్.ఇంత జాగ్రత్త తీసుకుంటున్నా... మిగిలిన హీరోలతో పోలిస్తే... మహేశ్ చేతిలోనేఎక్కువ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘ఆగడు’తో కలిపి ఆయన నాలుగు సినిమాలకు పచ్చజెండా ఊపారు.
పోలీసాఫీసర్‌గా: ‘దూకుడు’తో సంచలన విజయాన్ని అందుకున్న కాంబినేషన్... మహేశ్, శ్రీనువైట్ల. మళ్లీ వీరిద్దరి కలయికలో సినిమా అంటే... అంచనాలకు హద్దుండదు. దానికి తగ్గట్టే ‘ఆగడు’ తెరకెక్కుతోందని యూనిట్ సభ్యుల సమాచారం. ‘దూకుడు’లో లాగానే... ‘ఆగడు’లో కూడా మహేశ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు ఇందులో మహేశ్ కామెడీ... ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా ఉంటుందట. రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్‌ఎఫ్‌సీలో ఓ సెట్ వేశారు. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని సమాచారం.
మిర్చిఘాటుతో: తొలి సినిమాతోనే ‘మిర్చి’ ఘాటుని ప్రేక్షకులకు రుచి చూపించిన దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమాక్కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మహేశ్. జూలైలో వీరిద్దరి సినిమా మొదలుకానుందని సమాచారం. యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘మిర్చి’ని మించే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని తయారు చేసే పనిలో ప్రస్తుతం కొరటాల శివ బిజీగా ఉన్నారు.
అపూర్వ అవకాశం!: నాగార్జున తర్వాత ఏ తెలుగు హీరోకీ దక్కని అపూర్వ అవకాశం మహేశ్‌నే వరించింది. పాతికేళ్ల తర్వాత మణిరత్నం తెలుగులో చేస్తున్న సినిమాలో నాగార్జునతో కలిసి నటించడానికి మహేశ్ పచ్చజెండా ఊపేశారు. ఈ మల్టీస్టారర్ ఎప్పుడు మొదలవుతుందో... ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
మళ్లీ పూరీతో: పోకిరి, బిజినెస్‌మేన్... పూరీజగన్నాథ్ కాంబినేషన్‌లో మహేశ్ చేసిన రెండూ సినిమాలూ సూపర్‌హిట్సే. వీరి కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి కూడా రెడీ అవుతోంది. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పూరీ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత పూరీ చేయబోయేది మహేశ్ తోనే.