ఓ సినిమా సూపర్‌హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్‌పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం.
♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్‌పైన ఉంది.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్.
♦ హీరో అల్లు అర్జున్‌తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది.
‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది.
♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు.
అయితే ఈ సినిమాపై మరో అప్‌డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి.
♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment